కవర్ పేజీని చూసి.. పుస్తకం, ట్రైలర్ చూసి.. సినిమా రిజల్ట్ చెప్పలేం. అయితే ఒక అంచనాకి రావచ్చు. మంచి కవర్ పేజీ వుంటే చూపు పుస్తకం వైపు మళ్ళుతుంది. ట్రైలర్ బావుంటే.. సినిమాపై అంచనా పెరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఈ అంచనాలే దెబ్బకొట్టేస్తాయి. గతంలో చాలా సినిమాల విషయంలో ఇలా జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. కొమరం పులి, పంజా.. ప్రచార చిత్రాల విషయంలో ఇదే జరిగింది. ఈ రెండు సినిమాల ట్రైలర్.. అంచనాలని ఆకాశానికి తీసుకెళ్ళాయి. అదే అంచనాలతో థియేటర్ లోకి అడుగుపెడితే.. నిరాశ తప్పలేదు.
అయితే ఇప్పుడు ‘భీమ్లా నాయ’క్ విషయానికి వస్తే మేకర్స్ ఈ విషయంలో జాగ్రత్తపడ్డారనిపిస్తుంది. భీమ్లా ట్రైలర్ ని పెద్ద హడావిడి లేకుండా కట్ చేశారు. భీమ్లా ట్రైలర్ ని గమనిస్తే .. బద్దలైపోయే బ్యాగ్ గ్రౌండ్ మ్యుజిక్కులు, దుమ్ములేచిపోయే ఫైట్లు కనిపించవు. భారీ డైలాగులు కూడా వినిపించవు. దీనికి కారణం.. ఈ సినిమా కథ. మలయాళం సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ ని భీమ్లా నాయక్ గా రీమేక్ చేశారు. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మంచి సినిమా. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉహించే కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమా మాత్రం కాదు. పైగా ఈ కథ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి సరిపోతుందా లేదా అనే రిస్క్ కూడా వుంది. సినిమా చూశాక ఆ సంగతి తెలుస్తుంది.
చిన్న చిన్న కాన్సెప్టలతో కథలు అల్లుకుని హిట్లు కొట్టడం మలయాళం మూవీ మేకర్స్ ప్రత్యేకత. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కూడా అలాంటి కథే. గుండెధైర్యం, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, అహంకారంతో నిండిపోయిన ఓ రిటైర్ ఆర్మీ హవిల్దార్ మధ్య జరిగే ఈగో క్లాష్. జస్ట్ ఈగో క్లాష్.. అంతే. భయంకరమైన ఫ్లాష్ బ్యాకులు, బుర్రతిరిగిపోయే ట్విస్టులు, అదిరిపోయే పాటలు, భీవత్సమైన యాక్షన్ సీన్లు.. ఇవేమీ వుండవు. కానీ ఆ రెండు పాత్రలని డిజైన్ చేసిన విధానంలోనే బోలెడు యాక్షన్ వుంటుంది. ఆ రెండు పాత్రల మధ్య నెలకొన్న వైరం .. ఎప్పుడు.. ఎలా చల్లారుతుంది ? అందులో ఎవడు తగ్గుతాడు? అనే ఆసక్తితో సినిమా అంతా చూస్తాడు ప్రేక్షకుడు. అదే అయ్యప్పనుమ్ కోషియమ్ లో మ్యాజిక్.
భీమ్లా టీజర్ వచ్చినపుడు చాలా ఆసక్తి పెరిగిపోయింది. చాలా పెద్ద యాక్షన్ సినిమా అని చాలా మంది అనుకున్నారు. ”లాల్ లాల్… భీమ్ లాల్” పాట వచ్చినపుడు .. ఇందులో పాటలు కూడా అదిరిపోతాయని అనుకున్నారు. నిజానికి మలయాళంలో ఈ పాట లేదు. మలయాళం సినిమాలోని ఓ ఫైట్ మాంటేజ్ ట్రాక్ తీసుకొని అదే ట్యూన్ వాడుకొని పాట చేశాడు తమన్. అది తెలుగులోకి వచ్చేసరికి ప్రచారానికి బాగా పనికొచ్చింది. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పేరుతో మరో పాట చేశాడు. దీనికి కూడా కథలో స్కోప్ లేదు. అందుకే ఎండింగ్ టైటిల్స్ కార్డ్ లో ఈ పాట ని పేస్ట్ చేస్తారని వినిపిస్తుంది.
ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కూడా అంచనాలని న్యూట్రల్ చేసింది. ట్రైలర్ లో ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ ముఖ్య సారాంశం చూపించే ప్రయత్నం చేశారు తప్పితే హడావిడి జోలికి పోలేదు. ఇది ఒక రకంగా సినిమాకి చాలా మంచిది. పవన్ కళ్యాణ్ ఖాకీ చొక్కా వేసుకున్నాడని గబ్బర్ సింగ్ లా వుంటుదని థియేటర్ లో అడుగుపెట్టే ప్రేక్షకులకు ఈ ట్రైలర్ తో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. భీమ్లా నాయక్, డానియల్ శేఖర్ ల ఈగో స్టోరీ ఇది. వాళ్ళ ఈగో ఏంటో చూడటానికి మాత్రమే థియేటర్ కి రావాలని ఈ ట్రైలర్ తో ప్రేక్షకులని ప్రిపేర్ చేసినట్లయింది.