“హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం. కీలక సామాజిక వర్గాలైన జాట్లు, ఎస్సీ, ఎస్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు.” ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత సర్వే సంస్థల అభిప్రాయం అది. కాని ఎన్నికల ఫలితాల రోజు సీన్ చూస్తే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. హర్యానాలో కమలం పార్టీ చాలా కంఫర్ట్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. రాజకీయంగా ఇది కాంగ్రెస్ కు గట్టి దెబ్బే. వలిచి పెట్టిన పండును తినలేక కాంగ్రెస్ నేతలు అధికారం కోల్పోయారు అనే మాట అక్షరాలా నిజం.
వాస్తవానికి జాతీయ స్థాయిలో బీజెపికి అంత సౌకర్యవంతంగా రాజకీయం లేదు. అందుకే హర్యానా ఎన్నికల్లో విజయం ఆ పార్టీకి కీలకం. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల వంతు వచ్చింది. వచ్చే నెలలో మహా ఎన్నికల యుద్ధం జరగనుంది. దేశం మొత్తం ఒక ఎత్తు అయితే మహారాష్ట్ర ఎన్నికలు ఒక ఎత్తు. ఇక్కడి రాజకీయ పార్టీల్లో వర్గాలు ఎక్కువ. ఎన్సీపీ రెండుగా చీలింది. శివసేన కూడా రెండుగా చీలింది. ఒకరకంగా కాంగ్రెస్ ది కూడా అదే పరిస్థితి. ఇక్కడ హిందూ ఓటర్లు మూడుగా చీలిన పరిస్థితి. అలాగే మైనార్టీలు కూడా.
అసలు ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది, మళ్ళీ తిరిగి అధికారం చేపట్టడం సాధ్యమేనా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. శివసేన కార్యకర్తలు ఇప్పుడు ఏకనాథ్ షిండేపై సీరియస్ గా ఉన్నారు. అదే సమయంలో ఉద్దవ్ థాకరే సామర్ధ్యంపై వారికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదిత్య థాకరే జోక్యం విషయంలో శివసేనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉద్దవ్ థాకరే వర్గానికి ఉంది. ఇక ఎన్సీపీ విషయంలో కూడా అంతే. శరద్ పవార్ విషయంలో సానుభూతి ఎక్కువగా ఉంది. సుప్రియా సూలె ఈ విషయంలోనే ఎక్కువగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు.
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ను రాజకీయ వారసుడిగా అన్ని విధాలుగా శరద్ పవార్ ప్రోత్సహిస్తే వెన్నుపోటు పొడిచారని తమకు పట్టున్న 55 నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం గట్టిగా నిర్వహించేలా వ్యూహం సిద్దం చేసారు. ఇక కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ అగ్ర నేతలు… తమ వ్యూహాలకు పదును పెడుతూ… మహారాష్ట్ర నేతలకు అండగా నిలబడుతున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత కేసి వేణుగోపాల్, దినేష్ గుండూరావులు మహారాష్ట్ర విజయం కోసం రూట్ మ్యాప్ రెడీ చేసారు. సీట్ల విషయంలో కూడా అవసరమైతే ఒక అడుగు వెనక్కు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 225 స్థానాల్లో మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. ముంబై నగరంలో మెజారిటీ సీట్లు శివసేనకు వదిలేసారు.
ప్రభుత్వ వ్యతిరేకతను పెంచే విషయంలో మూడు పార్టీల అధినేతలు మహారాష్ట్రలో సక్సెస్ అయ్యారు. లాతూరు సహా కీలక ప్రాంతాల్లోని మరాఠా గ్రామాల్లో తాగునీటి సమస్య చాలా అధికం. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహం సిద్దం చేసి అడుగులు వేసారు. తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, మహారాష్ట్రలో స్థిరపడిన తమిళులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటం, ఎన్డియేని కలవరపెట్టే అంశం. ఈ ఎన్నికల్లో ఎన్డియే అధికారంలోకి రాకపోతే కేంద్రంలో అధికారానికి కూడా సమస్యలు ఎదురు కావచ్చు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్… మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అటు సరిహద్దు రాష్ట్రం ఝార్ఖండ్ లో కూడా బిజేపికి వ్యతిరేక పవనాలు ఉండటాన్ని నితీష్ గమనిస్తున్నారు. అధికార ఝార్ఖండ్ ముక్తి మోర్చాతో బిజేపి పొత్తు పెట్టుకున్నా ఎన్నికల తర్వాత సీన్ ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అందుకే నితీష్ ఇప్పుడు గడప దగ్గర నుంచున్నారని… ఎన్డియే గెలిస్తే లోపలికి అడుగు పెడతారని లేదంటే ఆయన అడుగులు బయటకే అంటున్నారు పరిశీలకులు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ఎన్డియేకు ఇబ్బంది లేకపోయినా… కాంగ్రెస్ తో చంద్రబాబు దూరంగా అయితే లేరు. అందుకే బీజేపి ఏపీని పెద్దగా ఇబ్బందులకు గురి చేయడం లేదనే అభిప్రాయం కూడా ఉంది. ఏది ఎలా ఉన్నా బిజేపి అధిష్టానంలో మహా ఎన్నికల భయం స్పష్టంగా కనపడుతోంది. మహారాష్ట్ర కోసమే హర్యానాను గురిపెట్టి కొట్టారని టాక్.