కేఏ పాల్ అమెరికా నుంచి సరాసరిన వచ్చి హైదరాబాద్‌లోనే దిగిపోయారు. ఆయన ఆంధ్రా పోవడం లేదు. గత ఎన్నికల్లో ఏపీలోనే తిరిగినా ఈ సారి మాత్రం తెలంగాణలో తిరుగుతున్నారు. తెలంగాణలోనే పోటీ చేస్తానంటున్నారు. పరామర్శ యాత్రలు కూడా చేస్తున్నారు. ఎందుకు తెలంగాణను ఎంపిక చేసుకున్నారో రాజకీయవర్గాలకు అంతు చిక్కడం లేదు. ఆయనను సీరియస్‌గా తీసుకుని టీఆర్ఎస్ నేతలు ఆయనపై దాడికి పాల్పడటం ఆయనకు మరింత ప్రచారాన్ని తెచ్చి పెట్టింది. తనపై దాడి విషయాన్ని చెప్పుకోవడానికి సమయం అడిగితే అమిత్ షా వెంటనే ఇచ్చేశారు.
దీంతో పాల్ వెనుక బీజేపీ ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలనుకుంటున్న బీజేపీ ఓటు సమీకరణాలు లెక్కలో వేసుకుంటోంది. తాము సాధించే ఓట్లతో పాటు ప్రత్యర్థులు సాధించే ఓట్లను కూడా చీల్చడం విజయానికి కీలకం. ఈ ప్రకారం టీఆర్ఎస్కు మద్దతిచ్చి క్రిస్టియన్ మైనార్టీ ఓట్లను చీల్చడానికి పాల్‌ను బీజేపీ ప్రయోగిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎలా లేదన్నా.. పాల్ మత ప్రచారకుడు. బయట ఆయనను జోకర్‌గా చూస్తారు కానీ ఆయన బోధనలు విన్నవారు మాత్రం…ఆయన పట్ల ఆరాధనా భావంతోనే ఉంటారు. అలాంటివారు నియోజకవర్గానికి ఐదు వందల మంది ఉన్నా.. బీజేపీకి లాభమే. ఆ మేరకు టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ తగ్గుతుంది.
అయితే బీజేపీ బీజేపీ ఒక్క పాల్ మీదే ఆధారపడటం లేదు. ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. అధికార పార్టీ ఓటు బ్యాంక్ చీలిక చేస్తే.. తాము ఓట్లు పొందినట్లేనని భావిస్తున్నారు. అందుకే పాల్ చేసే సాయం కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఎలాగైనా పాల్ ఈ సారి కేసీఆర్‌ను చిరాకు పెట్టాలని డిసైడ్ అయినట్లుగా భావిస్తున్నారు.