వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రఘురామకృష్ణంరాజు వ్యవహారం కలకలం రేపుతోంది. ఆయనను పార్టీ నుంచి దాదాపుగా దూరం చేశారు. కానీ సస్పెండ్ చేయడం వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కనీసం.. షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారని… ఉమ్మారెడ్డి చెప్పి.. వాటినే నోటీసులుగా భావించాలని మీడియా ద్వారా చెప్పడం…ద్వారా.. భవిష్యత్‌లోనూ నోటీసులు ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. అయితే ఆయనపై రాజకీయ పోరాటం మాత్రం.. వైసీపీ ప్రారంభించింది. వివిధ కుల సంఘాల పేరుతో.. ఆయన దిష్టిబొమ్మలు దహనం చేయించే ప్లాన్‌ను ప్రస్తుతం అమలు చేస్తున్నారు. ఎవరిపైనైనా రాజకీయ పోరాటం చేయాలంటే.. వైసీపీ అనుసరించే మొట్టమొదటి ఆయుధం.. కుల సంఘాలతో దిష్టిబొమ్మలు తగులబెట్టించడం. అది రఘురామకృష్ణంరాజుపై ప్రారంభించేశారు. అంటే.. ఆయన ఇక తమకు లేనట్లే వైసీపీ అంచనకు వచ్చేసినట్లు.
అయితే.. రఘురామకృష్ణంరాజు.. ఎందుకిలా.. చెలరేగిపోతున్నారో.. వైసీపీ నేతలకు అంతు చిక్కడం లేదు. ఆయన సామాన్యంగా ఇలా వ్యవహరించరని.. ఓ పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారన్న చర్చ వైసీపీలో నడుస్తోంది. ఆ ప్లాన్ ఏమిటన్నది వైసీపీ నేతలకు అంతుబట్టడం లేదు. ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా.. అన్న చర్చ వైసీపీలో సాగుతోంది. సాధారణంగా ఇలాంటి సందర్భాలు వస్తే.. టీడీపీకి అమ్ముడుబోయారని ఆరోపిస్తారు. ఇప్పుడు రఘురామ విషయంలో అలా చేయలేకపోతున్నారు. ఆయన వెనుక బీజేపీ ఉందని భావిస్తున్నారు. మంత్రి పేర్ని నాని కూడా.. రఘురామ విషయంలో మాట్లాడుతూ మోడీ పేరు ప్రస్తావించారు. అంటే.. రఘురామ ఆపరేషన్ వెనుక బీజేపీ ఉందని.. వైసీపీలోనూ అనుమానాలు ప్రారంభమయినట్లే అంటున్నారు.
భారతీయ జనతా పార్టీ.. తమకు మిత్రపక్షం లాంటి వైసీపీలో ఎందుకు చిచ్చు పెట్టాలనుకుంటుందనేది.. ఇప్పుడు.. చాలా మందికి అర్థం కాని ప్రశ్న. బీజేపీ ఊహించని రాజకీయ ప్రయోగాలను ఏపీలో చేయబోతోంతా… అన్న అనుమానాలు కలగడానికి ప్రస్తుత వ్యవహారాలు కారణం అవుతున్నాయి. ఒక్క రఘురామకృష్ణంరాజు బయటపడ్డారు. కానీ మిగతా మరికొంత మంది ఎంపీలు బీజేపీ హైకమాండ్‌తో టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు .. సీటు గ్యారంటీ హామీ ఇస్తే.. బీజేపీలోకి వస్తామంటూ.. కొంత మంది రాయబారాలు నడిపారని కూడా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో రఘురామ వ్యవహారశైలి వైసీపీ హైకమండ్‌ను.. ఆలోచింపచేస్తోంది. అదే సమయంలో.. సోషల్ మీడియోలో రఘురామ దూకుడు వెనుక సొంత పార్టీలోని కీలక నేత ఉన్నారని కూడా చెప్పుకుంటున్నారు. కానీ అది సోషల్ మీడియా ప్రచారమేనని వైసీపీ అగ్రనేతలు కొట్టి పారేస్తున్నారు.