తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలం పెంచుకోబోతున్నదని.. ఈ సారి తెలంగాణలో కూడా సీట్లు వస్తాయని… లగడపాటి రాజగోపాల్ చెప్పడం.. ఓ చిన్న పాటి కలకలానికి కారణం అవుతుంది. బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు కూడా రావని.. ఒకటి , రెండు వస్తేనే గొప్ప అన్నట్లుగా పరిస్థితి ఉందని చాలా మంది నమ్ముతున్నారు. నిజానికి ఈ పరిస్థితి నామినేషన్ల ప్రక్రియ ముగిసేవరకూ.. ఉంది. కానీ.. భారతీయ జనతా పార్టీ నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత.. కొన్ని సీట్లలో బలంగా ముందుకు వచ్చింది. ఈ సారి.. ప్రతి జిల్లాలోనూ దాదాపుగా.. కనీసం ఒకటి, రెండు చోట్ల.. గెలుపు కోసం.. రేసులో ఉన్న పరిస్థితి ఉంది. డిపాజిట్లు కోసం.. వెదుక్కునే సీట్లు పోను.. బీజేపీ.. ఇరవైకి పైగా సీట్లలో … ప్రధాన పార్టీ అభ్యర్థులతో గెలుపు కోసం పోటీ పడుతుందంటే.. ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
భద్రాచలంలో కుంజా సత్యవతి, సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వరరావు, ఆర్మూర్ లో వినయ్ రెడ్డి, జుక్కల్ లో అరుణతార, కరీంనగర్ లో బండి సంజయ్, చొప్పదండిలో బొడిగే శోభ, ఆందోల్లో బాబూమోహన్, నిజామాబాద్లో యెండల లక్ష్మినారాయణ… ఇలా దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు చోట్ల.. అభ్యర్థులు పోటీ ఇస్తున్నారు. అయితే వీరిలో ఎందురు బయటపడుతారనేది చెప్పలేము కానీ.. జిల్లాల్లోనూ… బీజేపీ.. రేసులో ఉందని..లగడపాటి చెప్పడానికి.. ఈ అభ్యర్థులే కారణం. అయితే.. ఈ కారణంగా బీజేపీ బలపడిందని మాత్రం ఊహించడం కష్టం. ఎందుకంటే.. జిల్లాల్లో బీజేపీ తరపున గెలుస్తారని భావిస్తున్న వారంతా… వలస నాయకులే. కాంగ్రెస్, టీఆర్ఎస్లలో టిక్కెట్లు దొరకని వారే ఎక్కువ. వారంతా.. వ్యక్తిగత ప్రాబల్యం కారణంగా రేసులోకి వచ్చారు కానీ..స్వతహాగా పెరిగిన బీజేపీ బలం వల్ల కాదు.
ఈ సారి.. గ్రేటర్ పరిధిలో బీజేపీ.. సీట్లు కోల్పోనుంది. ఆ సీట్లను.. జిల్లాల్లో పెంచుకోనుంది. గత ఎన్నికల్లో.. టీడీపీతో పొత్తు కారణంగా.. బీజేపీ ఐదు సీట్లను గెలుచుకోగలిగింది. జిల్లాల్లో మాత్రం.. చతికిల పడింది. అప్పట్లో.. పరిస్థితులు టీఆర్ఎస్కు అనుకూలంగా తెలంగాణ సెంటిమెంట్ కు ఏకైక చాంపియన్ గా కేసీఆర్ నిలిచారు. కానీ ఈ సారి మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అయినా తెలంగాణ రాష్ట్ర సమితికి బీజేపీని ప్రత్యామ్నాయంగా ప్రజలు చూడటం లేదు. కానీ.. ఇతర పార్టీల్లో టిక్కెట్లు దొరకని క్యాడర్ ఉన్న నేతలకు టిక్కెట్లు ఇవ్వడంతో.. వారిలో కొంత మంది బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా బీజేపీ బలం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.