భారతీయ జనతాపార్టీ 2014లో అఖండ విజయం సాధించడానికి కారణం యూపీఎ-2 హయాంలో జరిగిన అవినీతి. వరుస స్కాములతో… ఆ కాంగ్రెస్‌తో పాటు మిత్రపక్ష పార్టీల నేతలు అడ్డంగా దొరికిపోవడం… దానిని బీజేపీ…. శిఖరంలా ప్రచారం చేయడంతో.. ప్రజంతా.. యూపీఏపై తీవ్ర వ్యతిరేకతను ఓట్ల రూపంలో వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ వెలుగుగా బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన నరేంద్రమోదీ వైపు మొగ్గారు. కేవలం అవినీతి ఆరోపణలే.. యూపీఏపై అధికార వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం అన్నది ఎవరూ తోసిపుచ్చలేని విషయం. బీజేపీకి కూడా ఈ విషయంలో క్లారిటీ ఉంటుంది. కానీ అదే బీజేపీ .. కాంగ్రెస్ హయాంలో… దోపిడీదారులుగా వినుతికెక్కిన పెద్ద మనుషుల్ని ఇప్పుడు ఎందుకు… వెనుకేసుకొస్తుంది..? కేసులన్నీ తేలిపోయేలా.. సీబీఐని ఎందుకు డైరక్ట్ చేస్తుంది..? బీజేపీ అవినీతి పరుల్ని కాపాడుతున్నట్లు ప్రజలు భావిస్తున్నా ఎందుకు సిగ్గుపడకుండా.. అదే పంథాలో ముందుకు వెళ్తోంది..?
కారణాలేవైనా కానీ… మన్మోహన్ హయాంలో అవినీతికి పాల్పడినట్లు కేసులు ఎదుర్కొంటున్న బడా నేతలు.. మోదీ హయాంలో క్లీన్‌గా బయటకు వచ్చేందుకు దగ్గర దారి చూసుకంటున్నారు. టూజీ స్కాం, గాలి మైనింగ్ స్కాం, జగన్ అక్రమాస్తుల కేసులు.. వీటిలో ప్రధానమైనవి. టూజీ స్కాంలో ఇప్పటికే సాంకేతిక కారణాలతో… బెనిఫిట్ ఆఫ్ డౌట్ నిందితులకు వచ్చేసింది. వారంతా ఇప్పుడు ఫ్రీబర్డ్స్. ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డి వంతు వచ్చింది. అక్రమ మైనింగ్ అక్షరాలా నిజమని కర్ణాటక లోకాయుక్త నిర్ధారించి.. ఆధారాలతో సహా నిరూపిస్తే.. ఇప్పుడు సీబీఐ దానిని …సిల్లీ రీజన్స్‌తో తేల్చి పడేసే ప్రయత్నం చేసింది. నాలుగు రాష్ట్రాల్లో అక్రమ మైనింగ్ వ్యవస్థ పాతుకుపోయినందున.. నాలుగు రాష్ట్రాల్లోని సీబీఐ అధికారులు దర్యాప్తు చేశారు. గోవా, కర్ణాటక, తమిళనాడులు చిత్రవిచిత్రమైన కారణాలతో దర్యాప్తును క్లోజ్ చేసేశారు. ఏపీలో మాత్రం సీబీఐ జేడీగా లక్ష్మినారాయణ ఉన్నప్పుడు సాక్ష్యాధారాలతో కేసు పక్కాగా ఫైల్ చేశారు. ఇప్పుడు దీనిపైనే విచారణ జరుగుతోంది. కానీ ఆ మూడు రాష్ట్రాల సీబీఐలు తేల్చేసిన తర్వాత… ఇక్కడి సీబీఐ కోర్టుపై ఆ ప్రభావం ఉండదా..? గాలిని క్షమించేశామని.. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ చెబుతున్నదానికి అర్థం ఇదేనా..?
ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లోనూ బీజేపీ ఇదే చేయబోతోందని.. ఏపీలో చిన్న పిల్లవాడు కూడా నమ్ముతున్నాడు. వైసీపీ నేతలపై ఉన్న కేసుల కారణంగానే.. వారి జుట్టును…తమ చేతుల్లోకి తీసుకున్న మోదీ.. ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నారని ప్రజల్లోకి వెళ్లిపోయింది. తనను నమ్ముకుంటే మంచే జరుగుతుందని చెప్పేందుకు ఈడీ జప్తు చేసిన రెండు కేసుల్లో… కేంద్రం తన విచక్షణాధికారకాలతో..రిలీఫ్ ఇచ్చింది.దీంతో జగన్ కూడా.. మోదీ తన కేసులను మాఫీ చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు.
ఈ వ్యవహారాలన్నీ చూస్తూంటే.. ఏ అవినీతిని బూచిగా చూపి… కేంద్రంలో అధికారంలోకి వచ్చిందో.. అదే అవినీతికి అండగా ఉంటోంది బీజేపీ. ప్రజలు దేన్నైనా సహిస్తారు కానీ.. ఇలా ఎవరినైతే తప్పుగా చూపించారో.. వారినే హత్తుకోవడాన్ని మాత్రం క్షమించకపోవచ్చు. ఎందుకంటే.. ప్రజల్లో వారికి మోసపోయిన భావన ఏర్పడుతుంది. వారు అంత మంచివాళ్లైతే… వాళ్లనే చూపి తమను ఎందుకు రెచ్చగొట్టారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే బీజేపీకి ఇక నుంచి అవినీతిపై మాట్లాడే అర్హత లేదని ప్రజలంతా ఏకాభిప్రాయంతో చెబుతున్నారు.