కేసీఆర్ సర్కారుపై ఎవరు విమర్శించినా వేంటనే రిటార్ట్ ఉంటుంది. కానీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా పర్యటన నేపథ్యంలో తెరాస నుంచి అలాంటి దూకుడు కనిపించడం లేదు. అంతేకాదు, అమిత్ షా పర్యటన విషయమై ఎవ్వరూ తొందరపడి విమర్శలు చెయ్యొద్దంటూ నేతలకు స్వయంగా సీఎం కేసీఆర్ సంకేతాలకు ఇచ్చినట్టు సమాచారం. మూడు రోజుల పర్యటన సందర్భంగా తెలంగాణకు అమిత్ షా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పర్యటనలో ఆయన తెరాస ఉద్దేశించి ఏయే విమర్శలు చేశారో తరువాత చర్చించుకుందామనీ, ఆపై ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలనేది నిర్ణయించుకుందామనీ, ఈలోగా ఎవ్వరూ తొందరపడి వ్యాఖ్యానాలు చెయ్యొద్దంటూ పార్టీ నేతలకు సీఎం సూచించినట్టు వినిపిస్తోంది. అయితే, భాజపాపై కేసీఆర్ మౌనం వెనక మరో వ్యూహం ఉన్నట్టుగా చెప్పుకోవాలి.
నిజానికి, తెలంగాణలో తెరాస తరువాత కాస్తోకూస్తో బలంగా ఉన్న పార్టీగా కాంగ్రెస్ కనిపిస్తోంది. ద్వితీయ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపే ప్రజల మొగ్గు ఉందనేది కేసీఆర్ స్వయంగా చేయించుకున్న సీక్రెట్ సర్వే కూడా చెప్పింది. సో.. దీంతో ఇటీవలి కాలంలో కేసీఆర్ ఫోకస్ అంతా కాంగ్రెస్ నేతలమీదే ఉంటోంది. దద్దమ్మలనీ, అభివృద్ధి నిరోధకులనీ ఈ మధ్య ఆయన చేస్తున్న విమర్శల్ని చూస్తూనే ఉన్నాయి. అయితే, అమిత్ షా పర్యటనలో భాగంగా కేంద్ర పథకాలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారనీ, రాష్ట్రం నంబర్ వన్ కావాలంటే భాజపా రావాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. సాధారణంగా అయితే ఈ వ్యాఖ్యల్ని వెంటనే తెరాస తిప్పికొట్టాలి. కానీ, షా పర్యటన తమకు మరోలా ప్లస్ అవుతుందనేది కేసీఆర్ విశ్లేషణగా అర్థం చేసుకోవాలి!
ఎలా అంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడైతే బలంగా ఉందో, ఆయా ప్రాంతాల్లోనే అమిత్ షా పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో భాజపా బలపడే అంశాన్ని కాసేపు పక్కన పెడితే.. కాంగ్రెస్ బలహీనమౌతుంది కదా! అంటే, కాంగ్రెస్ బలంగా ఉన్న ఏరియాలో భాజపా ప్రభావం పడినా సమస్యేం ఉండదు అనేది తెరాస మౌనం వెనక వ్యూహంగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభావిత ప్రాంతాల్లో భాజపా బలపడితే పరోక్షంగా అది తెరాసకు ప్లస్ అవుతుంది. పైగా, ప్రస్తుతం అమిత్ షా తెరాసపై విమర్శలు చేస్తున్నా… రెండేళ్ల తరువాత టెర్మ్స్ మారవు అనే గ్యారంటీ ఏది..?
ప్రస్తుతం కేంద్రంలోని భాజపాతో తెరాసకు మంచి దోస్తీయే ఉంది. ఎన్డీయే భాగస్వామి కాకపోయినా మోడీ దగ్గర కేసీఆర్ మంచి మార్కులే వేయించుకున్నారు. భూసేకరణ బిల్లును ఆమోదింపజేసుకున్నారు, విద్యుత్ ప్రాజెక్టులు తెచ్చుకున్నారు, సచివాలయ నిర్మాణానికి పేరేడ్ గ్రౌండ్ స్థలం ఇచ్చేందుకు కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వచ్చేలా చేసుకున్నారు! కేంద్రం దృష్టిలో తెరాస వైరి వర్గం కాదు. సో.. ఇన్ని లెక్కలు ఉన్నాయి కాబట్టే, అమిత్ షా పర్యటనపై తొందరపడి ఎవ్వర్నీ విమర్శలు చెయ్యొద్దని కేసీఆర్ చెప్పి ఉండొచ్చు!