ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీకి వస్తున్నారు. ఆ కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరుగుతోంది. అన్ని పార్టీల ప్రతినిధులనూ ఆహ్వానిస్తున్నారు. కానీ జనసేనకు మాత్రం ఆహ్వానం అందిందో లేదో స్పష్టత లేదు. ఎలాంటి ఇన్విటేషన్ బయటకు రాలేదు. అయితే పవన్ మాత్రం కిషన్ రెడ్డి ఆహ్వానించారని.. తమ పార్టీ ప్రతినిధులు హాజరవుతారని ప్రకటించారు. ఆహ్వానం అందితే ప్రధానమంత్రి స్థాయి నేత పాల్గొనే కార్యక్రమానికి పవన్ హాజరు కాకుండా ప్రతినిధుల్ని పంపుతామని చెప్పరనే అభిప్రాయం వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షం జనసేన. ఏపీలో రాజకీయ పరిస్థితుల్ని ప్రభావితం చేయగల స్థాయిలో జనసేన ఉంది. ఆ పార్టీకి అధికారికంగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం కూడా ఉంది. అయినా కూడా జనసేనకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వడం లేదనే చర్చ జరుగుతోంది.
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వస్తున్న మోదీ కార్యక్రమానికి ఆహ్వానాలు పంపడానికి ఎలాంటి ప్రాతిపదికలు పెట్టుకున్నారో స్పష్టత లేదు… కానీ ఈ అంశం మాత్రం జనసేన వర్గాలకు మరింత అసంతృప్తిని కలిగిస్తోంది. బీజేపీ జాతీయ నేతలందరూ తనకు బాగా పరిచయమని..మోదీతో గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పటి నుండి సంబంధాలున్నాయని పవన్ చెబుతూంటారు. అయితే ఇప్పుడు మోదీ ఏపీ పర్యటనకు వస్తూంటే ఆయనను పూర్తిస్థాయిలో విస్మరించారు.
టీడీపీకి ఆహ్వానం పంపారు. నేరుగా చంద్రబాబును ఆహ్వానించలేదు. ఆయన ఎదురుపడటం ఇష్టం లేదు కాబట్టి.. ప్రతినిధిని పంపాలని కిషన్ రెడ్డి కోరారు. ఆ మేరకు టీడీపీ తరపున అచ్చెన్నాయుడు హాజరవుతారు. ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. బీజేపీ ప్రతినిధులూ ఎలాగూ ఉంటారు. చిరంజీవిని కూడా పిలిచారు. మొత్తంగా చూస్తే లోటు ఒక్క జనసేన విషయంలోనే కనిపిస్తోంది. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే. .. జనసేనకు ప్రాధాన్యం ఇవ్వకూడదని నిర్ణయించుకుని ఇలా చేశారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. కారణం ఏదైనా మొత్తంగా జనసేనను బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందన్న భావన వ్యక్తమవుతోంది.