కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అనుకునే అసమ్మతి ఇప్పుడు బీజేపీకి కూడా పాకుతోంది. బండి సంజయ్‌పై కొంత మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. హైకమాండ్ చెప్పినా వారు వినడం లేదు. సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుటున్నారు. హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన గు నేతలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. బండి సంజయ్ తీరుపైనే అసమ్మతి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అంశంపై పలువురు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు వీరి సమావేశం కలకలం రేపడంతో మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి అసమ్మతి నేతలతో చర్చించారు.
ఈ సమావేశాలపై బండి సంజయ్ మండిపడ్డారు. పార్టీ సిద్దాంతాలు, విధానాలకు లోబడి అందరూ పనిచేయాల్సిందేనని ..ఎవరైనా గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ఏ పార్టీలోనైనా కొందరు నిత్య అసంతృప్తి వాదులుంటారన్నారు. వారు పని చేయరు. పనిచేసే వారిపై అక్కసు వెళ్లగక్కుతారని బండి సంజయ్ మండిపడ్డారు.అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
సీక్రెట్ సమావేశాలపై గత నెలలో బీజేపీ నాయకత్వం సీరియస్ అయ్యింది. కొందరిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకొంటారనే చర్చ కూడా సాగింది.ఓ మాజీ ఎమ్మెల్సీపై వేటు వేస్తారన్న ప్రచారంజరిగింది. కానీ అసమ్మతి నేతలపై చర్యలు తీసుకోలేదు. కొంత కాలం సైలెంట్‌గా ఉన్న అసమ్మతి నేతలు మరోసారి తమ వాదన వినిపిస్తూ తెరపైకి వచ్చారు.దీంతో బండి సంజయ్‌కూడా వేటు వేస్తామని హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది.