తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల విషయంలో బీజేపీ పెద్దగా ఆసక్తి లేనట్లుగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్క సారే అమిత్ షా వచ్చి అంతర్గత సమావేశం నిర్వహించి వెళ్లారు. కానీ పబ్లిక్ మీటింగ్స్ పెట్టలేదు. తాజాగా ఆయన పర్యటనకు రావాల్సి ఉన్నా చివరి క్షణంలో రద్దు చేసేశారు. అంతే కాదు.. ఇప్పటివరకూ తెలంగాణ ఇంచార్జులుగా కీలక బాధ్యతలు నిర్వహించిన తరుణ్ చుగ్, ప్రకాష్ జవదేకర్ వంటి వారిని కూడా వేరే రాష్ట్రాలకు పంపించారు. ప్రకాష్ జవదేకర్ ఎన్నికల ఇంచార్జుగా వ్యవహరించారు.
తరుణ్ చుగ్‌కు లద్దాఖ్ బాధ్యతలు ఇచ్చారు. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. కొన్ని పార్టీ వ్యవహారాలు.. కొన్ని రోజులు అధికార వ్యవహారాలకు కేటాయించాల్సి వస్తోంది. మరో వైపు ఎంపీ టిక్కెట్ల కోసం పోరాటం ఓ రేంజ్ లో జరుగుతోంది. మహబూబ్ నగర్ లో డీకే అరుణ, జితేందర్ రెడ్డి మధ్య పోరాటం జరుగుతోంది. మల్కాజిగిరి, కరీంనగర్ సహా అనేక చోట్ల టిక్కెట్ల కోసం ఎక్కువ మంది నేతలు పోటీ పడుతున్నారు.
ఇలాంటి సమయంలో తెలంగాణ బీజేపీపై హైకమాండ్ దృష్టి తగ్గించడం ఆ పార్టీ నేతల్ని నిరాశ పరుస్తోంది. ఎంపీ ఎన్నికల్లో మోదీవేవ్ తో.. స్వీప్ చేస్తామన్న నమ్మకంతో ఉన్నారు. కానీ పార్టీ నేతల మధ్య అంతర్గత పోరాటంతో.. ఎవరూ మాట వినే పరిస్థితి లేకపోవడంతో.. పార్టీ హైకమాండ్ కూడా లైట్ తీసుకుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.