భాజపా సర్కారు మెడ ముందు అవిశ్వాస తీర్మానం కత్తి వేలాడుతోందనే చెప్పాలి. నిజానికి, దీనిపై పార్లమెంటులో చర్చకు అనుమతి ఇచ్చినా.. ఇప్పటికిప్పుడు మోడీ సర్కారు కూలిపోయే పరిస్థితేమీ లేదు. కానీ, దీంతో మోడీకి గర్వభంగం జరుగుతుందనే చర్చ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏపీ అధికార, విపక్షాలు వేర్వేరుగా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. దీనిపై సోమవారం చర్చకు ఆస్కారం ఉంది. తీర్మానం చర్చకు పెట్టాలంటే కనీసం 54 మంది సభ్యుల మద్దతు కావాలి. కానీ, పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ తోపాటు ఇతర ప్రముఖ ప్రాంతీయ పార్టీల ఎంపీలు కూడా అవిశ్వాసానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 100కి పైగా సభ్యుల సపోర్ట్ వచ్చేలా ఉంది. దీంతో సభలో తీర్మానం ప్రవేశపెట్టక తప్పని పరిస్థితే సోమవారం ఉండొచ్చు.
అయితే, భాజపా మూడ్ చూస్తుంటే ఏదో ఒక కారణం చూపించి, సభను నిరవధికంగా వాయిదా వేసే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. బడ్జెట్ పై తూతూ మంత్రంగా చర్చ జరిపారు. బిల్లులన్నీ ఆదరాబదరాగా ఆమోదించేసి మమ అనిపించేశారు. నిరవధిక వాయిదాకు దాదాపు సిద్ధంగా ఉన్నట్టే లెక్క. పైగా, సభ సజావుగా సాగినేతే తీర్మానం ప్రవేశపెడతామని స్పీకర్ సుమిత్రా మహాజన్ నిన్న కూడా వ్యాఖ్యానించడం కూడా గమనార్హం. కాబట్టి, సోమవారం నాడు సభ మొదలు కాగానే ఎలాంటి నిరసనలూ హంగామా లేకుంటే అవిశ్వాసం చర్చకు రావొచ్చు. ఆ మాత్రం సంయమనం ఏపీకి చెందిన పార్టీలు పాటించినా… ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీలను ఈలోగా భాజపా గిచ్చి, ఏదో ఒక హడావుడి సృష్టించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి..!
సభను నిరవధికంగా వాయిదా వేసేందుకు కావాల్సిన ఒక స్టాండర్డ్ సాకు భాజపా దగ్గర ఇప్పటికే ఉంది..! బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచీ ఇప్పటివరకూ ఉభయ సభల సమావేశాలూ సజావుగా సాగలేదనీ, అత్యంత విలువైన సభా సమయం వృధా అవుతోందీ, ప్రజాధనం దుర్వినియోగమౌతోందీ అనే కలరింగ్ ఇచ్చే అవకాశం ఉంది. సభ సజావుగా సాగడం లేదు కాబట్టి, నరవధిక వాయిదా ప్రకటన ఏ క్షణమైనా ఉండే అవకాశాలనూ తోసిపుచ్చలేం. అనుకున్నట్టుగా అవిశ్వాసం ప్రవేశపెట్టి, చర్చకు అనువైన వాతావరణాన్ని సోమవారం నాడు సభలో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ఏపీ నేతలపై ఉందనే చెప్పాలి.