ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తులు ఖరారయ్యాయి. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపారు. స్వయంగా పవన్, చంద్రబాబు ఇద్దరే సర్వేలు, ఇతర నివేదికల్ని మందు పెట్టుకుని సీట్ల సర్దుబాటు కసరత్తు చేసుకున్నారు. ఇక మంచి రోజు చూసుకుని ప్రకటించడమే తరువాయి అనుకున్నారు కానీ.. అది మాత్రం ముందుకు సాగడం లేదు. మధ్యలో చంద్రబాబు బీజేపీతో చర్చలకు ఢిల్లీకి వెళ్లడం..వెంటనే జగన్ కూడా వెళ్లి ప్రధాని మోదీతో కలిసి వచ్చారు. తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు.
భారతీయ జనతా పార్టీ ఏపీలో పొత్తుల అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తాము జనసేనతో పొత్తులో ఉన్నామని..జనసేన ఎన్డీఏలో ఉందని బీజేపీ నేతలు నిర్మోహమాటంగా ప్రకటిస్తూ ఉంటారు. కానీ జనసేన మత్రం టీడీపీతో సీట్ల సర్దుబాటు చర్చలు కూడా పూర్తి చేసుకుంది. గతంలో బీజేపీ కూడా కలసి రావాలని బహిరంగంగా అడిగిన పవన్ కల్యాణ్ తర్వాత బీజేపీ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. అంటే.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసుకున్నా.. తమను శత్రువుగా చూడవద్దని చెప్పినట్లయింది. అయితే హఠాత్తుగా బీజేపీ కూడా టీడీపీ, జనసేన కూటమిలోకి రావాలనుకుందని తెలుస్తోంది. అందుకే చంద్రబాబును చర్చలకు ఆహ్వానించారని అంటున్నారు. చంద్రబాబు వెళ్లారు.. వచ్చారు.. కానీ అంతర్గతంగా ఏం జరిగిందో మాత్రం ఎవరికీ తెలియడం లేదు.
గతంలో కూడా చంద్రబాబు ఓ సారి ఢిల్లీ వెళ్లి అమిత్ షా , జేపీ నడ్డాలతో సమావేశం అయ్యారు. ఆ మీటింగ్ వివరాలు బయటకు రాలేదు. ఈ సారి కూడా మీటింగ్ వివరాలు బయటకు రాలేదు. ఖచ్చితంగా రాజకీయాలు, పొత్తులపైనే చర్చలు జరిగాయని చెప్పాల్సిన పని లేదు. ఈ చర్చలు జరిగిన తర్వాతనే అమిత్ షా ఎన్డీఏలోకి కొత్త్ పార్టీలు వస్తున్నాయని ఏపీలో పొత్తుల సంగతి త్వరలో తేల్చేస్తామని ప్రకటించారు. అయితే ఆయన టీడీపీ కూటమిలోకి వస్తుందని చెప్పలేదు. కానీ గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలు ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ సమీకరణాల వల్లే వెళ్లిపోయారని ఆ పార్టీల తప్పేమీ లేదన్నట్లుగా చెప్పుకొచ్చారు. అంటే ఆయన టీడీపీ ఎన్డీఏలోకి రావడంపై సానుకూలంగా ఉన్నట్లుగానే చెబుతున్నారు. కానీ ఆ తర్వాత సీఎం జగన్ ప్రధాని మోదీని కలిశారు. ఆయన కూడా రాజకీయాలపైనే చర్చించి ఉంటారు. ఏ ప్రతిపాదనలు పెట్టారన్నదానిపై స్పష్టత లేదు. కానీ.. ఏపీలో పొత్తుల అంశంపై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది.