ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు .. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలకు లింక్ ఉన్న ఓ స్కామ్‌ను తమ గుప్పిట పట్టారు. అదే.. హీరా గ్రూప్ స్కాంకు సంబంధించిన వ్యవహారం. వేల కోట్లు వసూలు చేసిన… “హిరా గ్రూప్ ” నకు చెందిన నౌహిరా వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. అన్ని వేల కోట్లు.. ఇతర దేశాల నుంచి సైతం వసూలు చేస్తున్నా.. కేంద్రం .. కానీ ఆర్బీఐ కానీ ఎందుకు పటించుకోలేదో .. ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. నిజానికి 2015 నుంచే హీరాగ్రూప్ ఆర్థిక కార్యకలాపాలపై రిజర్వ్ బ్యాంకు కన్నేసింది. భారీ ఎత్తున వినియోగదారుల నుంచి డిపాజిట్లు వసూలు చేస్తోందన్న ఫిర్యాదులు వెళ్లాయి. 2016లో మరిన్ని ఫిర్యాదులు పెరగడంతో ఈడీతో విచారణ చేయించారు. ఆరోపణల్లో వాస్తవం ఉందని తేలడంతో హీరాగ్రూప్ వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని 2016లోనే ఆర్బీఐ పోలీసు శాఖను కోరింది. కానీ ముందుకు సాగలేదు. దానికి కారణం.. బీజేపీ అగ్రనేతలే.
హీరా గ్రూప్ ను ఒంటి చేత్తో నడిపిన నౌహిరా షేక్ ఫేస్ బుక్ పేజీ చూస్తే.. అన్ని బీజేపీ నేతలతో దిగిన ఫోటోలు ఉంటాయి. ప్రధాని మోడీని సమర్థిస్తూ.. పెట్టిన పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. ఆమె ఏర్పాటు చేసే కార్యక్రమాలకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉంటారు. బుల్లెట్ రైలు శంకుస్థాపన సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మోదీ ఫొటోతో నౌహీరా షేక్ భారీగా పత్రికా ప్రకటనలు ఇచ్చారు. హోర్డింగులు ఏర్పాటు చేశారు. సంస్థ వెబ్సైట్లో బీజేపీ నేతలకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. అంతే కాదు.. కర్ణాటక ఎన్నికల్లో ఆమె కొత్తగా ఓ పార్టీ పెట్టారు. చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి భారీగా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులను నిలబెట్టారు. ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి లాభం చేకూర్చడానికేనని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమని తేలుతోంది.
చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం కల్లూరులో నిరుపేద కుటుంబంలో నౌహీరా ఆర్థికంగా అత్యంత అనుమానాస్పదంగా ఎదిగారు. విదేశీ మారక ద్రవ్య నిబంధనలను కూడా ఆమె ఉల్లంఘించారు. హీరాగోల్డ్, హీరా ఫుడెక్స్, హీరా టెక్స్టైల్స్.. ఇలా తన గ్రూపు సంస్థల్లోకి వందల కోట్ల విలువైన డాలర్లు, రియాళ్లు, దినార్లను మళ్లించారు. ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు.. ఏపీలోనూ.. నౌహిరాపై కేసులు ఉన్నాయి. వాటిపై .. పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి.. కేంద్ర దర్యాప్తు సంస్థలతో.. కేంద్రం చేస్తున్న రాజకీయానికి గట్టి కౌంటర్ ఇవ్వడానికి టీడీపీకి.. నౌహికా షేక్ కేసు ఓ ఆయుధంగా కనిపిస్తోంది.