జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు. ఆయన పొత్తులపై ఎలాంటి అడుగులు వేయాలో ఓ అంచనాకు వచ్చారు కానీ ఎలా వేయాలో మాత్రం అర్థ కావడం లేదు. బీజేపీతో ఉంటే ఓట్లు చీలిపోవడం తప్ప… ఇంకే ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశంపార్టీకి దగ్గరవుతున్నారు. చంద్రబాబుతో నేరుగానే చర్చలు జరిపారు. అంతర్గతంగా ఏమైనా చర్చలు జరుపుతున్నారా లేదా అన్నది స్పష్టత లేదు. కానీ చంద్రబాబు విషయంలో పవన్ వేగంగా స్పందిస్తున్నారు. ఎర్రగొండపాలెంలో చంద్రబాబుపై రాళ్ల దాడిని పవన్ వెంటనే ఖండించారు.
టీడీపీతో కలవాలని అనుకుంటున్న పవన్ కల్యాణ్ ను బీజేపీ అడ్డుకుంటోందని పితాని సత్యానారాయణ ఆరోపించడం కలకలం రేపింది. ఎంత కాలం అడ్డుకుంటారో చూస్తామని ఆయన బీజేపీని హెచ్చరించారు. దీనిపై జనసేన నేతలు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. బీజేపీ నేతలు కూడా స్పందించలేదు. పవన్ కల్యాణ్ తాను బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ కోసం చూస్తున్నానని గతంలో ప్రకటించారు. మూడు రోజుల కిందట సునీల్ ధియోధర్ పవన్ కు ఇవ్వాల్సిన రూట్ మ్యాప్ లన్నీ ఇచ్చేశామని ఇక నిర్ణయం ఆయనదేనని చెప్పుకొచ్చారు.
మరో వైపు బీజేపీతో కలుస్తారా అన్న ప్రశ్నకు అచ్చెన్నాయుడు మీడియా ముందు భిన్నమైన సమాధానం ఇచ్చారు. ఆ పార్టీ వైసీపీతో కలిసి ఉందని ప్రజలు నమ్ముతున్నారని… స్పష్టం చేశారు. అలాంటి పార్టీతో ఎలా కలుస్తామన్నట్లుగా మాట్లాటారు. వైసీపీతో కలిసి లేమని ప్రజలు నమ్మేలా ఎలా చేయాలో కూడా ఆయన పరోక్షంగా చెప్పారు. అడ్డగోలు అప్పులకు అనుమతిని నిరాకరించాలని ఆయన అంటున్నారు. అయితే అది రాష్ట్ర నాయకుల చేతుల్లో లేని అంశం.
టీడీపీ, జనసేన విషయంలో పాజిటివ్ స్పందనలు ఉన్నా.. బీజేపీ మాత్రమే.. ఆ రెండు కలవకుండా చేస్తోందన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరి జనసేన ఈ అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తుందో ?