తెలంగాణలో హైడ్రా చుట్టే రాజకీయం నడుస్తోంది. ఎక్కడ చూసిన హైడ్రా గురించే చర్చ.. రచ్చ. రేవంత్ సర్కార్ ను ప్రజల్లో దోషిగా నిలబెట్టేందుకు హైడ్రా తిరుగులేని అస్త్రమని భావిస్తోంది బీఆర్ఎస్. అందుకే గతంలో నిర్దేశించుకున్నకార్యాచరణను పక్కనపెట్టేసి పోరాటంలోకి దూకుతుంటే.. బీజేపీ మాత్రం బీఆర్ఎస్ వద్దని పక్కనపెట్టేసిన అస్త్రాన్ని వెలికితీసి కాంగ్రెస్ పై సమరానికి సై అంటోంది.
సంపూర్ణంగా రైతు రుణమాఫీ జరగకపోయినా.. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిపోయిందని ప్రచారం చేసుకుంటోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే రుణమాఫీ పూర్తికానీ రైతుల కోసం తెలంగాణ భవన్ లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేసింది. రుణమాఫీ పూర్తి కానీ రైతులతో ఆందోళన చేపట్టాలని భావించింది. కానీ, ఇంతలోనే హైడ్రా వివాదం మరింత వేడెక్కడంతో… రైతు రుణమాఫీ అంశాన్ని బీఆర్ఎస్ పక్కనపెట్టేసింది.
రైతు రుణమాఫీ అంశంతో రాజకీయం చేసేందుకు బీఆర్ఎస్ సమాయత్తం అయినా.. రైతుల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదు. పైగా..బీఆర్ఎస్ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ అని దోఖా చేశారంటూ వేలెత్తి చూపిస్తున్నారు. దీంతో రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై పోరాటడం పక్కనపెట్టి … ప్రస్తుతం సెగలు రేపుతోన్న హైడ్రాతో ముందుకు వెళ్తేనే సక్సెస్ ఉంటుందనే.. రైతు ఉద్యమాలను బీఆర్ఎస్ పక్కన పెట్టినట్లుగా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో…రైతు రుణమాఫీపై మొదట్లో హడావిడి చేసిన బీజేపీ.. ఆ తర్వాత ఆ ఫైట్ ను కొనసాగించలేకపోయింది. ప్రస్తుతం హైడ్రా ఆందోళనలు కొనసాగుతుంటే ఈ అంశంపై రాజకీయం చేస్తే కావాల్సినంత స్టఫ్ దొరికే అవకాశం ఉన్నా.. హైడ్రాను వదిలేసి రైతు సమస్యలపై రణం బాట పడుతామని బీజేపీ దీక్షలు చేస్తుండటంపై ఆ పార్టీలోని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వదిలేసిన అస్త్రాలను చేబూని రాజకీయం చేయడం ఏంటని ఆఫ్ ది రికార్డ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.