పదేళ్లు అధికారంలో ఉండి కాబోలు.. ప్రతిపక్ష పాత్రను నిర్విర్తించడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారు. సర్కారును ఎలా ఇరుకున పెట్టాలో తెలియక గింజుకుంటున్నారు. సీనియర్ సభ్యులైన హరీష్ రావు , కేటీఆర్ సైతం అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో తేలిపోతున్నారు. రాష్ట్రంలో అత్యాచారాల విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకే రోజు నాలుగు సంఘటనలు జరిగాయని ప్రభుత్వాన్ని ఎక్స్ ద్వారా హరీష్, అసెంబ్లీలో కేటీఆర్ నిలదీసే ప్రయత్నం చేశారు. కానీ వారి వాదనలు ఎందుకో తేలిపోయాయి.
తెలంగాణలో ఒకేరోజు నాలుగు అత్యాచార ఘటనలు జరిగాయని సర్కార్ పై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నాలుగు ఘటనలు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్నాయి. అలాగని ఒకే రోజున ఈ ఘటనలు చోటు చేసుకోలేదు.. కాకపోతే ఒకే రోజున బయటకు వచ్చాయి. వనస్థలిపురంలో ఓ హోటల్ లో స్నేహితుడితో కలిసి పార్టీకి వెళ్ళిన సాఫ్ట్ వేర్ అమ్మాయి అత్యాచారానికి గురైంది. మరోవైపు ట్రావెల్స్ బస్సులో ప్రయాణించే మహిళపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. శాలిగౌరారంలో దివ్యాంగ మహిళపై అత్యాచారం.. వీటిని ప్రస్తావించిన హరీష్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అనుకున్నారు.
Also Read : విధేయతకే పట్టం..పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో ట్విస్ట్..!
అయితే, ఇక్కడ హరీష్ రావుతోపాటు కేటీఆర్ వేలెత్తి చూపించాల్సింది రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల గురించి కాదు.. శాంతిభద్రతలను పర్యవేక్షించే శాఖకు మంత్రి.. హోం మినిస్టర్ లేకపోవడం అని, ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకోవడం వల్లే ఇలా జరుగుతున్నాయని ఇరుకునపెట్టే అవకాశముండేది. అలా కాకుండా నాలుగు డైలాగులు కొట్టామా.. ప్రభుత్వాన్ని తిట్టామా అన్నట్టుగా సాగిపోయింది కేటీఆర్, హరీష్ వ్యవహారం. ఏదేమైనా ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారనేది చాలా మంది అభిప్రాయంగా వినిపిస్తోంది.