లోక్ సభ ఎనికల్లో అంచనాలు తలకిందలు కానున్నాయా..? అసలు ఏమాత్రం ప్రభావం చూపదని అంచనా వేసిన బీఆర్ఎస్ మ్యాజిక్ చేయబోతుందా..? కేసీఆర్ బస్సు యాత్రతో జనాల మూడ్ చేంజ్ అయిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తర్వాత వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం అంతంత మాత్రమేనని విశ్లేషణలు వ్యక్తం అయ్యాయి. కానీ , కేసీఆర్ బస్సు యాత్ర తర్వాత పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. రైతుబంధు, కరెంట్ కోతలు, ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యాలను వివరిస్తూ జనాలను బీఆర్ఎస్ వైపు ఆకర్షితుల్ని చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలను ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ ఈ అంశాన్ని పలు చోట్ల హైలెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే కొత్త జిల్లాలు రద్దు అవుతాయంటున్నారు.
రైతుబంధు , పంట నష్టపరిహారంపై ప్రభుత్వంలో తాజాగా కదలిక రావడానికి కేసీఆర్ బస్సు యాత్రే కారణమని బీఆర్ఎస్ బలంగా చెప్తుండటంతో జనాల ఆలోచనలో మార్పు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. పలు లోక్ సభ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండగా ఎప్పటికప్పడు చేస్తోన్న సర్వేలో తాజాగా బీఆర్ఎస్ మెరుగైన స్థానంలోకి వచ్చినట్లుగా సమాచారం. కాంగ్రెస్ – బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అంచనా వేయగా బీఆర్ఎస్ అనూహ్యంగా రేసులోకి వచ్చేసింది. దీంతో హస్తం – కమలనాథుల్లో అలజడి మొదలైంది.
నిజామాబాద్ లో ప్రధాన పోటీ బీజేపీ – కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని అంతా అనుకున్నా… అందరి అంచనాలను తలకిందులు చేసేలా బీఆర్ఎస్ పోటీలోకి వచ్చేసింది. బీజేపీ – బీఆర్ఎస్ మధ్య 2% మాత్రమే తేడా ఉండటంతో బీఆర్ఎస్ ఈ సెగ్మెంట్ లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇదే అంశాన్ని కేసీఆర్ రోడ్ షోలో సైతం చెప్పారు. కాంగ్రెస్ 20 శాతంతో వెనకబడిందని ఇందూరులో గెలిచేది బీఆర్ఎస్సేనన్నారు.
నిజామాబాద్లో పోయినసారి గెలిపించిన బీజేపీ ఎంపీతో ఏమన్న లాభం జరిగిందా..? ఏకాణా పని కూడా కాలేదు కదా..?మరెందుకు బీజేపీకి ఒటేయ్యాలని ప్రజలను కేసీఆర్ ఆలోచింపజేశారు.రోడ్ షో సక్సెస్ కావడంతో నిజామాబాద్ లో బీఆర్ఎస్ టాప్ లోకి వెళ్తుందని ఆ పార్టీ ధీమాగా ఉంది. అసలు ఆశలు లేని స్థితి నుంచి లక్ష్యానికి చేరువగా రావడంతో బీఆర్ఎస్ లో కొత్త జోష్ కనిపిస్తోంది.