తెలంగాణ రాజకీయాల్లో కులగణన ఇప్పుడు కీలకంగా మారింది. ఆ టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు బీఆర్ఎస్ రోజుకో ప్లాన్ అమలు చేస్తున్నారు. కానీ కులగణనపై తన వాదన మాత్రం చెప్పడం లేదు. కులగణనను సమర్థిస్తే కాంగ్రెస్ చేస్తున్న పనిని సమర్థించినట్లు అవుతుంది. అది బీఆర్ఎస్కు ఇష్టం ఉండదు. వ్యతిరేకిస్తే బీసీ వర్గాల్లో వ్యతిరేకత వస్తుంది. అందుకే ఈ టాపిక్ ను వీలైనంతగా పట్టించుకోకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.
నిజానికి ఈ కులగణన అనేది ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేసిన సకల జనుల సర్వే లాంటిదే. కేసీఆర్ తొలి సారి సీఎం అయినప్పుడు ఒక్క రోజులో తెలంగాణ మొత్తాన్ని స్తంభింపచేసి సర్వే నిర్వహించేశారు. అయితే ఆ డేటా అంతా ఎటు పోయిందో.. ఎందుకు ఉపయోగించారో ఎవరికీ తెలియదు. ఓ కుటుంబానికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించారు. అలాంటి సర్వే కేంద్రం కూడా చేయాలని అప్పట్లో సలహా ఇచ్చారు. మరి తర్వాత ఆ డేటాను ఉపయోగించలేదో ఎవరికీ తెలియదు.
ఇప్పుడు కులగణన పేరుతో రేవంత్ సర్కార్ అదే చేస్తోంది. అన్ని వివరాలూ సేకరిస్తోంది. ఆస్తులు, అప్పుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ తన విధానాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. ఈ కులగణన వల్ల తమకు అవకాశాలు మెరుగుపడతాయని బీసీ వర్గాలు అనుకుంటూ ఉండటమే దీనికి కారణం.