తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఖాళీ అయ్యిందంటే.. తిరుమలేశుని దర్శనానికి మించి ఒత్తిడి మొదలవుతుంది.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మీద. చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్ష పదవీకాలం ముగిసిన అనంతరం చంద్రబాబు నాయుడుకు ఇదే పరిస్థితి ఏర్పడింది. మురళీ మోహన్, హరికృష్ణ, బీద రవిచంద్ర, డాక్టర్ కె. లక్ష్మీనారాయణ ఇలా అనేక రకాల పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. వేంకటేశ్వరుని లీలామానుషాంతరంగం భక్తుడికి ఎలా అంతుపట్టదో.. చంద్రబాబు అంతరంగమూ అంతే. కానీ, పదవి ఇస్తున్నట్లు ఆయన ఎక్కడా.. ఎప్పుడూ సంకేతాలివ్వరు. కానీ, ఇవ్వట్లేదని మాత్రం సంబంధిత ప్రముఖుడికి సూటిగానే చెబుతారు. అందుకు కారణాలను కూడా వివరిస్తారు. సుదీర్ఘ రాజకీయానుభవంలో చంద్రబాబులో ఉన్న మంచి లక్షణమిది. అందుకే పార్టీ నాయకులు కోరిన పదవివ్వలేదని కినిసిన సందర్భాలు అరుదు. ఒకవేళ అలిగినా.. తొందర్లోనే సర్దుబాటైపోతుంది. దానికి ఉదాహరణ కొన్ని నెలల క్రితం మంత్రివర్గ విస్తరణ తరవాత వెల్లువెత్తిన నిరసనలు.. రాజీనామాలు.. అలకలూ.. అవి అణిగిపోయిన విధానమూనూ.
రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ టీటీడీ పదవిపై ఎంతో ఆశపెట్టుకున్నారు. క్రమశిక్షణాయుతమైన జీవిత సరళి ఉన్న మురళీమోహన్ను మించి నేతలు ప్రస్తుత రాజకీయాల్లో లేరు. ఆయన్ను కూడా చంద్రబాబు పక్కన పెట్టేశారు. ఎందుకో ఆయనకు మాత్రం వివరించారు. ఇదే విషయాన్ని ఆయన ఓ రియాల్టీ షోలో వివరించారు కూడా. పదవివ్వలేదని తనకు ఎటువంటి అసంతృప్తీ లేదనీ ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఆయనకూ చంద్రబాబుకూ నడుమ ఏదో ఉందనుకున్న వారు కూడా సంతృప్తి చెందారు. మిగిలిన పేర్లన్నీ అలాఅలా గాల్లో వచ్చినవే అనుకోవాలి. ఎందుకంటే వాటికి ఆధారం లేదు.. విశ్వసనీయత అంతకంటే లేదు. ఇప్పటికే అధ్యక్ష పదవి ఖాళీ అయిపోయి మూడు నెలలు దాటింది. వెంటనే చంద్రబాబు దీనిపై ఏదో ఒకటి తేల్చేయాల్సుంది. అందుకు నంద్యాల ఉప ఎన్నిక అడ్డంకిగా ఉంది. బహుశా ఈ నెల 24నే టీటీడీ చైర్మన్ ఎవరనే అంశంపై స్పష్టత రావచ్చు. ఈ పదవికి కొత్తగా కాదు కానీ.. మీడియాలో ఓ పేరు విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఆయనే సిఎం రవి శంకర్. చిత్తూరు .జిల్లా మదనపల్లికి చెందిన రవిశంకర్ కంటే ఉత్తమ వ్యక్తి లేరని డెక్కన్ క్రానికల్ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. పత్రికలూ, టీవీలూ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఒక చానెల్లో ఆయనపై ఒక అభిప్రాయాలతో కూడిన ఓ కథనం ప్రసారమైంది. తెలుగు దేశం పార్టీ సభ్యుడైనప్పటికీ రవిశంకర్ అందులో చురుగ్గా లేరు. ఆధ్యాత్మికవేత్తగా, పారిశ్రామికవేత్తగా ఆయనకు మంచి పేరుంది. మృదుస్వభావి అయిన రవిశంకర్ పేరును ఆధ్యాత్మిక గురు రవిశంకర్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఫార్సు చేశారనీ వార్తలు వినవస్తున్నాయి. చంద్రబాబు ఈ ప్రతిపాదనను అంగీకరించారని కూడా అంటున్నారు. ఈసారి రాజకీయేతరులకు ఆ పదవి ఇస్తామని చంద్రబాబు కొంతకాలంగా చెబుతున్నారంటున్నారు. రవిశంకరే తదుపరి టీటీడీ చైర్మన్ అని ఎంత బలంగా వార్తలు వినిపిస్తున్నా.. వేంకటేశ్వరుని ఆస్తిపాస్తులకు తదుపరి ట్రస్టీ ఎవరో తేలడానికి ఈ నెల 24వరకూ ఆగాల్సిందే.
-సుమ