పుంగనూరు ప్రముఖ పారిశ్రామిక వేత్త, గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన రామచంద్రయాదవ్ కు వై సెక్యూరిటీ భద్రతను కేంద్రం కల్పించినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత లేనప్పటికీ.. ఇటీవల రామచంద్ర యాదవ్ అమిత్ షాతో నలబై నిమిషాలకుపైగా సమావేశం అయ్యారు. ఆయనకు అపాయింట్మెంట్ రావడం ఏమిటి.. ఏకంగా నలభై నిమిషాల సేపు మాట్లాడటం ఏమిటని అప్పుడే చర్చించుకున్నారు. ఆ షాక్ తో పోలిస్తే..వై కేటగిరి సెక్యూరిటీ కల్పించడం పెద్ద మ్యాటర్ కాదని ఆయన అనుచరులు చెబుతున్నారు.
రామచంద్ర యాదవ్ బీజేపీ నేత కాదు.. ప్రస్తుతం జనసేనలో కూడా లేరు. కానీ సొంతంగా రాజకీయ కార్యకలాపాలు చేపడుతున్నారు. బెంగళూరులో మంచి వ్యాపారవేత్తగా ఉన్న ఆయనకు చాలా మంది బీజేపీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన గృహప్రవేశానికి.. బాబా రామ్ దేవ్ సహా చాలా మంది ప్రముఖులు వచ్చారు. ఆయన పలుకుబడిని తక్కువగా అంచనా వేయలేమని పుంగనూరులో ప్రచారం ఉంది. ఆయన పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి.. పుంగనూరులో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అయితే పుంగనూరు అంటే.. పెద్దిరెడ్డి మార్క్ అరాచకం ఉంటుంది. ఎవరైనా సరే్.. ఆయన వర్గం చేసే దాడులకు గురవ్వాల్సిందే. తగ్గకపోతే ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. టీడీపీ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన అనూషారెడ్డి ఆ తర్వాత కంట నీరు పెట్టుకుని ఇక రాజకీయాలు వద్దని వెళ్లిపోయారు. ఆమె అనామకురాలు కాదు.. గట్టి రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మహిళే. అలాంటామే తట్టుకోలేకపోయారు. ఇప్పుడు రామచంద్రయాదవ్ జనసేనకు దూరంగా ఉన్నా..ఇటీవల రైతు భేరీ పేరుతో ఆయన సభ పెట్టారని చెప్పి ఆయన ఇంటిపై చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఇళ్లపై దాడులు చేసి కొట్టడం సహజంగా మారింది. పుంగనూరులో అయితే ఎక్కువ.
ఈ పుంగనూరు వ్యవహారాన్ని రామచంద్రయాదవ్ అమిత్ షా దృష్టికి తీసుకెళ్లడంతో ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించారంటున్నారు. అదే నిజం అయితే.. పుంగనూరులో ఉన్న పరిస్థితుల్ని కేంద్రం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.