ఎన్డీయే నుంచి టీడీపీ విడిపోయిన దగ్గర నుంచీ సీఎం చంద్రబాబు విషయంలో భాజపా ఏదో చేయబోతోందన్న ఊహాగానాలు చాలానే ఉన్నాయి. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తరువాత ఏపీపై దృష్టి సారిస్తారని భాజపా నేతలే అభిప్రాయపడ్డారు.. ఈ నేపథ్యంలోనే రాజ్ భవన్ వేదికగా ఏపీలో రాజకీయ అనిశ్చితి సృష్టించాలనే కుట్ర జరుగుతోందన్న కథనాలూ వచ్చాయి. ఈ పరిణామాల తరువాత, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. దాదాపు గంటా నలభై నిమిషాలపాటు సాగిన ఆ భేటీలో ఏం మాట్లాడుకున్నారో ఎవ్వరికీ తెలీదు! ఆ వివరాలను ముఖ్యమంత్రీ ఆరోజున మీడియాకి చెప్పలేదు. ఇద్దరు పాత మిత్రుల కలయిక మాత్రమే, దీనికి రాజకీయ ప్రాధాన్యతా లేదని గవర్నర్ కూడా అసలు విషయాలను వెల్లడించలేదు.
ఇది జరిగిన రెండ్రోజుల తరువాత గవర్నర్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు! తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పంచాయతీ రాజ్ దినోత్సవంలో ఆయన గవర్నర్ పై విమర్శలు చేశారు. ఏకంగా గవర్నర్ వ్యవస్థే ఉండకూడదన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నర్ పై పోరాడిన సందర్భాన్నీ గుర్తు చేశారు. గవర్నర్ ను అడ్డుపెట్టుకుని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారనీ, తెలుగుదేశం ప్రత్యర్థులను ఆయనే కలుపుతున్నారంటూ కథనాలు పత్రికల్లో వస్తున్నాయని చంద్రబాబు ప్రస్థావించారు.
నరసింహన్ తో భేటీ జరిగిన రెండ్రోజుల తరువాత చంద్రబాబు ఇలా స్పందించడం విశేషం. గవర్నర్ పై ఈ స్థాయిలో అసహనం వ్యక్తం చేశారంటే… గంటన్నరకుపైగా సాగిన ఆ భేటీలో ఏం జరిగి ఉంటుందనేదే ఇప్పుడు చర్చ! గవర్నర్ ద్వారా రాయబారం పేరుతో టీడీపీని హెచ్చరించే ప్రయత్నం భాజపా చేసిందా అనే అనుమానాలు ఈ సందర్భంగా కలుగుతున్నాయి. ఆంధ్రాలో రాజకీయ అనిశ్చితి సృష్టించాలనే ఉద్దేశంతో గవర్నర్ కేంద్రంగానే భాజపా కుట్ర చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తడం.. ఆ తరువాత, సీఎంతో గవర్నర్ భేటీ… ఆ భేటీపై అనంతరం చంద్రబాబు స్పందన ఇలా ఉండటం… ఇవన్నీ చూస్తుంటే రాజకీయంగా కేంద్రం ఏదో చేస్తోందనే అనుమానాలకు బలం చేకూరినట్టుగానే కనిపిస్తున్నాయి. చంద్రబాబుతో భేటీ అనంతరం మూడు రోజుల పర్యటన కోసం గవర్నర్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర పెద్దలతో మాట్లాడి వస్తారు. ఏదైమనా, గవర్నర్ ద్వారా హెచ్చరించే ప్రయత్నం కేంద్రం చేసినట్టుగా ఉందనే అభిప్రాయానికి బలం చేకూర్చేలా చంద్రబాబు ప్రతిస్పందన ఉండటం గమనార్హం.