తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజున నాడు… నిరశన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం చేసిన అన్యాయాన్ని సరిదిద్ది.. విభజన చట్టం హామీలు అమలు చేయడంతో పాటు.. ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాహారదీక్ష చేస్తూండటం సహజంగానే దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ బీజేపీ దృష్టికి వెళ్తుందా..? ప్రదాని మోదీ పట్టించుకుంటారా.. అన్నదే అసలు సందేహం.
ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం… నిస్సందేహంగా వివక్ష చూపించింది. విభజన చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. మిత్రపక్షంగా ఉన్నప్పటికీ.. టీడీపీకి కనీస గౌరవం ఇవ్వలేదు. రాజధాని లేకుండా ఏర్పడిన రాష్ట్రానికి .. రాజధాని నిర్మాణానికి చేయూత నివ్వాల్సింది పోయి.. అమరావతిని మయసభలో పోల్చి ఎకసెక్కాలు ఆడారు. అదే గుజరాత్ లో థోలెరా పేరుతో నిర్మిస్తున్న …అతి పెద్ద మహా నగరానికి వేల కోట్లు ధారబోస్తున్నారు. ఇవన్నీ తెలుగోడి కడుపు మండేలా చేసేవే. కానీ ఏవోవో ఇచ్చామని వితండ వాదన చేస్తూ.. బీజేపీ.. టైం పాస్ చేసుకొస్తోంది. కానీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిరంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓ రకంగా.. బీజేపీకి మునుపెన్నడూ లేనంత ఇమేజ్ డ్యామేజ్ అయిందికూడా.
చంద్రబాబు ఇంతటితో వదిలి పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. నిరాహాదీక్ష ముగిసిన వెంటనే.. కేంద్రంపై పోరాట కార్యచరణ ప్రకటిస్తారు. నేరుగా మోదీని ఢీకొడుతున్నారు. జిల్లాల వారీ బహిరంగసభలు పెట్టబోతున్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా వినూత్న కార్యక్రమాలు అమలు చేయబోతున్నారు. ఇలా చేస్తే బీజేపీకి పోయేదేం లేదు. ఎందుకంటే…ఏపీలో బీజేపీకి ఏమీ లేదు. చంద్రబాబుకి ఈ మాత్రం తెలియక కాదు. ఈ పోరాటాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లి..ఉత్తరాదిలో కూడా బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసే వ్యూహమే చంద్రబాబు అమలు చేస్తున్నారు.
కానీ రాజు కంటే మొండివాడు బలవంతుడు. ఇక్కడ రాజే మొండివాడు. ఏం జరిగినా.. ఆయన పద్దతిలో ఆయనుంటారు. మరి చంద్రబాబు దీక్ష ఫలిస్తుందా..? పుట్టిన రోజు నాడు కడుపుమాడ్చుకున్న ఫలితం లభిస్తుందా..? మోదీ దిగి వస్తారా..? ఏపీ డిమాండ్ల పట్ల సానకూలంగా స్పందిస్తారా అంటే… తొంభై శాతం ..సాధ్యం కాదనే చెప్పాలి.