పోలవరం ప్రాజెక్ట్ పనుల కొనసాగింపునకు కేంద్రం ఆమోదించింది. 2015 చివరిలో పోలవరం పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన “స్టాప్ వర్క్ ఆర్డర్”పై స్టేను మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి సీకే మిశ్రా బుధవారం సంతకం చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో కేంద్ర పర్యావరణశాఖ మంత్రి హర్షవర్దన్ ఈనెల 6న ఢిల్లీకి వస్తారు. ఆయన సంతకం పెట్టగానే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పోలవరం పనులపై ఎన్జీటీ ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్‌పై ఉన్న స్టే గడువు జూలై 2తో ముగిసిపోయింది. అప్పట్నుంచి పోలవరం పనుల కొనసాగింపు అనిశ్చితి నెలకొంది.
తమ రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాల్లో సరిగ్గా ప్రజాభిప్రాయసకేరణ చేయలేదంటూ.. కొన్నాళ్ల కిందట ఒడిసా, ఛత్తీస్‌గఢ్ జాతీయ హరిత ట్రైబ్యునల్ లో పిటిషన్ వేశాయి. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ 2015 చివరిలో స్టాప్ వర్క్ ఆర్డర్ ఆదేశాలిచ్చింది. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి… అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిగా ఉన్న ప్రకాశ్ జవదేకర్‌తో మాట్లాడారు. ఆ ఆదేశాలపై 2016లో ఆయన స్టే ఉత్తర్వులిచ్చారు. వాటిని ఏడాదికోసారి ప్రభుత్వం పొడిగించుకుంటూ వస్తోంది. చివరిగా ఇచ్చిన స్టే ఆర్డర్.. జూలై 2వ తేదీతో స్టే గడువు ముగిసిపోయింది. కేంద్రంతో చంద్రబాబు ఘర్షణ వైఖరితో ఉండటంతో.. ఈ ఉత్తర్వులు కేంద్రం కొనసాగిస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పనులు నిలిపివేయాలంటూ ఒడిషా ప్రభుత్వం.. కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. ఒడిషా సీఎం కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తున్నారు. బీజేడీ – బీజేపీ మధ్య పొత్తు చర్చలు కూడా జరుగుతున్నట్లు ప్రచారం ఉంది. అదే సమయంలో… బీజేపీ కూడా ఒడిషాలో బలపడుతోంది. ఇక్కడి ప్రజల సెంటిమెంట్లకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకునే పరిస్థితిలో లేదు. అందుకే… పోలవరం పనులు పెండింగ్‌లో పడిపోతాయన్న ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆలస్యమైనా .. పనుల కొనసాగింపునకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.