‘మీరేంటి సార్… లాజిక్కులు ఎవరూ నమ్మరు. అందరికీ మేజిక్కులు కావాలి. అందుకే మన సైంటిస్టులు కన్నా బాబాలు ఫేమస్’ అని ‘జులాయి’లో డైలాగ్ రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి కొన్ని సెంటిమెంట్లు వుంటాయి. అందులో కుర్చీ చేరిందా? అని సందేహం కలుగుతోంది. త్రివిక్రమ్ గత నాలుగు సినిమాల టీజర్లు గమనిస్తే… మూడింటిలో కుర్చీ కామన్‌గా కనిపిస్తుంది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో ఉపేంద్రను చూపించకుండా కుర్చీ మీద ఫ్రేమ్స్ పెట్టి ప్రేక్షకుల్లో అతడి పాత్రపై క్యూరియాసిటీ కలిగించాడు. పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ విడుదల తేదీని ప్రకటనకు కట్ చేసిన మ్యూజికల్ సర్ప్రైజ్లో పవన్‌ని చూపించకుండా చివర్లో కుర్చీని ఎక్కువ ఫోకస్ చేశారు. అప్పట్లో ఆ కుర్చీ రాజకీయ వార్తలకూ ముడిసరుకు అయ్యింది. పవన్ తలచుకుంటే ముఖ్యమంత్రి కుర్చీని అలా తిప్పేస్తాడని చెప్పడమే త్రివిక్రమ్ ఉద్దేశమని ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేశారు. అయితే సినిమాలో కుర్చీ తయారి వెనుక ఎంతమంది కష్టం వుందనే డైలాగ్ రాశారు త్రివిక్రమ్.
‘అజ్ఞాతవాసి’ తరవాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. కొన్ని గంటల్లో ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్లోనూ కుర్చీ వుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ పోస్టర్లో చూపించారు. టీజర్లో కుర్చీ పాత్ర ఏమిటో తెలియాలి. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ టీజర్ రీ రికార్డింగ్ పూర్తి చేశారు. టీజర్ రెడీజి వుంది. రేపు ఉదయం తొమ్మిది గంటలకు టీజర్ విడుదల కానుంది.