చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటూ ఎదుర్కొన్న రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. 1999లో తొలి సీఎంగా ఉండి పార్టీని గెలిపించారు. అదే ఆఖరు. ప్రతిపక్షంలో ఉండి పోరాడి అధికారంలోకి వస్తున్నారు కానీ అధికారంలో ఉండి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తంటాలు పడాల్సి వస్తోంది. దానికి తానే కారణం అని చంద్రబాబు అంగీకరిస్తున్నారు. మరి అలాంటి తప్పులు ఇప్పుడు జరగకుండా చూసుకుంటున్నారా?
అధికారంలోకి వస్తే పార్టీని మార్చిపోతారన్న విమర్శలు
చంద్రబాబు అధికారంలోకి వస్తే రాజకీయం మర్చిపోతారని పూర్తిగా పాలన, అభివృద్ధిపైనే సమయం కేటాయిస్తారన్న విమర్శలు ఉన్నాయి. ప్రజలు ఇచ్చిన విజయాన్ని ఆయన ఓ బాధ్యతగా తీసుకుంటారు. ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి పూర్తిగా వారి కోసం.. రాష్ట్రం కోసం పని చేయాలని ఆయన అనుకుంటారు. ఆ ప్రకారమే పని చేస్తారు. కానీ ఈ క్రమంలో పార్టీని మర్చిపోతారు. ఎన్నికలకు ముందు పార్టీని పట్టించుకున్నా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
ప్రతిపక్షంలో ఉంటే పూర్తిగా పార్టీకే సమయం
ప్రతిపక్షంలో ఉంటే పూర్తిగా పార్టీని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉంటే పోరాటాలు చేసి విజయం సాధించడం ఈజీగానే చేస్తారు. తేడా అంతా చంద్రబాబు సమయం కేటాయించడం గురించే ఉంటుంది. ఈ తప్పుల్ని చంద్రబాబు గుర్తించినట్లుగా ఆయన మాటల్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఇక్కడ అసలు సమస్య ఆయన కరెక్ట్ చేసుకుంటున్నారా లేకపోతే మళ్లీ అవే తప్పుల్ని చేస్తున్నారా అన్నదానిపైనే.
పార్టీని మళ్లీ నిర్లక్ష్యం చేస్తున్నారా ?
ఇటీవల జరిగిన పరిణామాలు..సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం చూస్తే.. పార్టీని మళ్లీ నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్త హత్య మరింత చర్చకు కారణం అయింది. చంపేస్తారని వీడియో రిలీజ్ చేసిన ఆ కార్యకర్తను వైసీపీ వాళ్లు వదల్లేదు. ఇలాంటి పరిస్థితుల్ని మార్చాల్సిన అవసరం ఉంది. పాలనతో పాటు పార్టీపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోందని సామాన్య కార్యకర్తల అభిప్రాయం.