లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో… కేంద్ర బడ్జెట్ సమావేశాలు త్వరలో ఉంటాయి. ఆంధ్రా విషయంలో ఇప్పటికే పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మోడీ సర్కారు… ఈ సమావేశాల్లోనైనా కొంతైనా సానుకూలంగా వ్యవహరిస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే, రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని అయినా కొన్ని ప్రజాకర్షక నిర్ణయాలను ఈ సమయంలో ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందనే ఆశాభావం కొంత వ్యక్తమౌతోంది. ఈ నేపథ్యం.. ఈ చివరి అవకాశాన్ని కూడా ఏపీ ఎంపీలు సద్వినియోగం చేసుకునే దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశాల్లో మరోసారి ఏపీ సమస్యలపై ఎలాంటి గళం వినిపించాలనే అంశమై ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో… ఢిల్లీలో చంద్రబాబు దీక్షకు దిగితే ఎలా ఉంటుందనే ప్రతిపాదన చర్చకు వచ్చింది.
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రాకి సంబంధించిన సమస్యలు ప్రస్థావనకు రాకపోతే… ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్షకు దిగితే బాగుటుందనే అభిప్రాయమే సమావేశంలో వ్యక్తమైనట్టు తెలుస్తోంది. అయితే, పార్లమెంటు జరుగుతున్న సమయంలోనే దీక్షకు దిగాలా… లేదంటే, సమావేశాలు ముగిసిన తరువాత దీక్షకు వెళ్లాలా అనే అంశమై ఇంకా కొంత స్పష్టత రావాల్సి ఉందని సమాచారం. ఉన్న ఈ తక్కువ సమయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా ఏరకంగా దీక్షా కార్యక్రమం ఉంటే బాగుంటుందనే అంశమై కూడా సమాలోచనలు జరిగాయని అంటున్నారు.
ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేయడం ద్వారా ఆంధ్రాకు జరుగుతున్న అన్యాయాన్ని మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయం చేసినట్టు అవుతుందనే అభిప్రాయం ఎంపీలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు దీక్షకు కూర్చుంటే… మద్దతుగా భాజపాయేతర పక్షాలన్నీ వస్తాయనీ, ఈ కార్యక్రమం కచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేదిగా ఉంటుందనే అభిప్రాయాన్ని ఎంపీ సుజనా చౌదరి సమావేశంలో వ్యక్తం చేసినట్టు సమాచారం. ఢిల్లీలో ఏపీ సీఎం దీక్ష చేస్తే… భాజపాయేతర పార్టీలన్నీ మరోసారి ఒకే వేదిక మీదకి వచ్చే అవకాశం ఉంటుందని భావించినట్టు తెలుస్తోంది. అయితే, దీక్ష ఎక్కడ చేస్తారూ, ఎలా చేస్తారనే అనేది పార్టీలో మరికొంత చర్చ జరిగే అవకాశం ఉందనీ, ఆ తరువాతే స్పష్టత వస్తుందని పార్టీ నేతలు అంటున్నారు.