ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి కన్సెంట్ పర్మిషన్ రద్దు చేయగానే.. కొంత మంది గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. అవినీతి పరులకు… చంద్రబాబునాయుడు అండగా నిలుస్తారని విమర్శలు ప్రారంభించారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ లాంటి వాళ్లు కూడా.. అవినీతిని అడ్డుకునే వ్యవస్థలను అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఆయన సీబీఐలో చేశారు కాబట్టి.. ఆయన నిజాయితీగా పని చేసి ఉంటారు కాబట్టి… సీబీఐలో ఉన్న వాళ్లందరూ నిజాయితీగా ఉంటారనుకుంటారు. అది ఆయన వ్యక్తిత్వం. కానీ పరిస్థితులు అలా లేవని.. సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణే తేల్చిచెబుతోంది.
ఎన్ని సీబీఐ కేసులు నమోదవుతున్నాయేంటి..?
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు.. సీబీఐ సోదాలు చేయాలన్నా.. విచారణ జరగాలన్నా ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి. ఈ కారణంగానే.. అక్రమార్కులు నిశ్చింతగా ఉంటారని… కొంత మంది బాధపడిపోతున్నారు. కానీ.. సీబీఐ… గత నాలుగేళ్ల కాలంలో ఏపీలో కానీ.. తెలంగాణలో కానీ.. ఎన్ని కేసులు నమోదు చేసింది. ఎంత మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై… కేసులు నమోదు చేసింది..? కనీసం పదుల సంఖ్యలో కూడా.. సీబీఐ … కేసులు నమోదు చేయలేదు. యాక్టివ్ ఆపరేషన్స్ చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోనే అత్యంత దారుణమైన అవినీతి పరులు ఉన్నారు. ఎంత మందిపై ఆరోపణలు వస్తే.. సీబీఐ అధికారులు ఎంత మందిపై విచారణ జరిపారు..? సాక్ష్యాలతో సహా ఫిర్యాదులిచ్చినా.. మ్యాన్ వపర్ లేదని… పక్కన పెట్టేసిన కేసులో కోకొల్లలుగా ఉంటాయి. ఇటీవలి కలంలో ఏపీలో ఒక్క సీబీఐకేసు కూడా నమోదు కాలేదు. అంత ఎందుకు.. అసలు ఏపీ.. ఏ సీబీఐ డివిజన్ కింద వస్తుంది..? ఆ డివిజన్ జాయింట్ డైరక్టర్ ఎవరో… ఎవరికైనా తెలుసా..? . వీవీ లక్ష్మినారాయణ జేడీగా ఉన్నప్పుడు… ఇక్కడో సీబీఐ బ్రాంచ్ ఉందని తెలిసింది కానీ… తర్వాతా అలాంటి జేడీ ఒకరున్నారని ఎవరికీ తెలియదు. మరి ఇప్పుడు.. ఏపీ ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని విచారణ చేయాలన్న ఆదేశాలతో… సీబీఐకి ఎక్కడ కళ్లెం పడుతుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ కేసులు పెట్టొచ్చా…?
రాజ్యాంగం ప్రకారం… రాష్ట్రంలో పని చేసే ఉద్యోగులు.. వాళ్లు ఏపీ ప్రభుత్వమా.. కేంద్ర ప్రభుత్వమా అన్నదానితో సంబంధం లేదు.. ఏపీ పోలీసులకు చర్యలు తీసుకునే అధికారం ఉంది. ఇంతకు ముందు సీబీఐ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంది కాబట్టి.. వారికి పర్మిషన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి… ఏసీబీ అధికారులు … ఆయా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగుల అవినీతిపై దృష్టి పెట్టేవారు కాదు. ఇప్పుడు సీబీఐ.. ఏపీకి రావాలంటే ప్రభుత్వ పర్మిషన్ ఉండాలని స్పష్టం చేసింది కాబట్టి.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపైనా.. అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకునే అధికారం ఏసీబీకి ఉంది. ఏసీబీకి పటిష్టమైన నెట్ వర్క్ ఉంది. గత రెండు, మూడేళ్లుగా… కార్యదర్శుల స్థాయి అధికారుల అవినీతిని బట్టబయలు చేసి వందల కోట్ల అక్రమ ఆస్తిని వెలికి తీసింది. ఇప్పుడు.. కూడా.. ఏసీబీ తమ వాట్సాప్ నెంబర్‌తో ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ఎవరిపై అవినీతి ఆరోపణలు వచ్చినా.. దాడులు చేసి కేసులు పెట్టడానికి సంపూర్ణ అధికారాలు ఉన్నాయి. ఆ దిశగా.. ఏసీపీ దాడులకు సిద్ధపడుతోందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా.. ఆదాయపు పన్ను శాఖ అధికారులపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. కేంద్ర ఉద్యోగుల్లో అత్యంత అవినీతి పరులు.. ఆదాయపు పున్ను శాఖలోనే ఉంటారని.. చాలా మంది నమ్ముతూ ఉంటారు.
కోర్టు ఆదేశిస్తే.. ఏ జీవో పని చేయదా..!
నిజానికి సీబీఐపై… చంద్రబాబు జీవో జారీ చేయక ముందు కూడా.. . దానికంతటికి అది విచారణ జరపడానికి వీల్లేదు. ఢిల్లీలో నమోదైన కేసులపై విచారణ జరుపుకుంటారేమో కానీ.. ఏపీకి సంబంధించినంత వరకూ.. ఏదైనా కేసుపై విచారణ జరపాలంటే…ప్రభుత్వం సిఫార్సు చేయాలి. లేకపోతే.. సొంతంగా విచారణ చేయడానికి లేదు. కానీ.. రాజకీయ పెద్దల జోక్యంతో సీబీఐ.. వ్యూహాత్మకంగా.. ఢిల్లీలో కేసు నమోదు చేసి.. ఏపీకి వచ్చి విచారణ చేయవచ్చు. ఈ విషయంలో రాజకీయం ఎంతకైనా తెగిస్తుంది. అందుకే చంద్రబాబు జీవో జారీ చేశారు. అయితే… సీబీఐ విచారణ విషయంలో కోర్టు ఆదేశాలు జారీ చేస్తే.. ఏ ప్రభుత్వం కూడా అడ్డు చెప్పలేదు. జగన్ పై జరిగిన కోడికత్తి దాడికి సంబంధించి విచారణ జరపాలని కోర్టు ఆదేశిస్తే… అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వానికి అధికారం లేదు.
కేంద్ర – రాష్ట్ర సంబంధాలను దెబ్బతీశారా..?
ఏపీకి కేంద్రం.. ఎప్పుడు దారుణంగా వంచించిందో.. అప్పుడే.. కేంద్ర రాష్ట్ర సంబంధాలు దెబ్బతిన్నాయి. ఫెడరల్ వ్యవస్థలో ఏది అయితే.. ఉండాలో..దాన్నే దెబ్బ తీసేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం అన్ని రకాల వ్యవస్థల్ని… ప్రయోగించింది. రాష్ట్రాలన్నీ కలిస్తేనే.. కేంద్రం. కేంద్రానికి ప్రత్యేకంగా ఉనికి ఉండదు. అయినా కేంద్రం రాష్ట్రాలను… గుప్పిట్లో పెట్టుకునేలా … మాట వినకపోతే.. అంతు చూస్తామనేలా హెచ్చరించేలా చర్యలు చేపట్టినప్పుడే.. కేంద్ర – రాష్ట్ర సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ విషయంలో మోడీకి.. ఏ బీజేపీయేతర ప్రభుత్వం మద్దతు తెలియజేయడం లేదు.
——— సుభాష్