ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు… సీబీఐకి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయడం రాజకీయంగా కలకలం రేపింది. తెలుగుదేశం పార్టీ మద్దతు దారులు అనుకూలంగా విపక్ష పార్టీలు కాబట్టి సహజంగనే వ్యతిరేకత చూపించాయి. మరి తటస్థుల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది..?. ఏపీలో కొంత కాలం నుంచి.. ముఖ్యంగా.. ఎన్డీఏ నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిన తర్వాత నుంచి.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏపీపై గురి పెట్టాయి. తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉన్న నేతలు, వ్యాపారవేత్తలను.. లక్ష్యంగా చేసుకున్నారు. చివరికి గుంటూరులో ఉంటూ… టీడీపీకి సానుభూతి పరునిగా ఉంటున్న… ఓ చిన్న స్థాయి నేతను కూడా వదిలి పెట్టలేదు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆర్థిక వనరులు అందుబాటులో ఉండకూడదన్న ఉద్దేశంతో.. ఈ తరహా దాడులు చేస్తున్నారని అందరికీ అర్థమైపోయింది.
సీబీఐకి చంద్రబాబు భయపడ్డారా..?
అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత … సీబీఐని కూడా.. టీడీపీ నేతలపై ప్రయోగించడానికి అంతా సిద్ధమైందన్న ప్రచారం ఢిల్లీలోనే సాగుతోంది. ఇందు కోసం ప్రత్యేకమైన టీముల్ని ఏర్పాటు చేశారని.. వారికి ప్రత్యేకమైన శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. చంద్రబాబు … జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టకుండా.. వీలైనంతగా నియంత్రించడం ఈ దాడుల లక్ష్యమని చెబుతున్నారు. అందుకే చంద్రబాబు ముందస్తుగా.. అలాంటి దాడులు జరగకుండా… తన అధికార పరిధి మేరకు ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కన్సెంట్ పర్మిషన్ రద్దు చేశారు. అయితే.. ఇది తెలుగుదేశం పార్టీ మద్దతు దారులకు సంతృప్తి పరిచి ఉండవచ్చు కానీ.. వ్యూహాత్మక తప్పిదమేమోనన్న భావన చాలా మందికి వస్తోంది. సహజంగానే.. ఏవో అక్రమాలు చేశారని.. అందుకే.. సీబీఐ అంటే.. భయపడుతున్నారని .. విమర్శలు రావడానికి అవకాశం ఉంది. వస్తున్నాయి కూడా. వీటిని తిప్పికొట్టడం ఇబ్బందికర పరిణామమే.
సోదాలు చేసి ఇమేజ్ డామేజ్ చేసే కుట్ర జరిగిందా..?
యూపీఏ హయాంలో కానీ.. ఎన్డీఏ హయాంలో కానీ.. సీబీఐ నీతిగా.. నిజాయితీగా.. దర్యాప్తు చేసిన కేసు ఒక్కటి కూడా లేదని.. టీడీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. కేవలం అధికారంలో ఉండే పార్టీ రాజకీయ అవసరాల కోసం ప్రత్యర్థి పార్టీల నేతల్ని .. ఆయా పార్టీలతో సన్నిహితంగా ఉండేవారిని టార్గెట్ చేయడానికే పనికొస్తోంది. పోనీ వాళ్లు నిజంగానే అవినీతి చేశారని.. నిరూపించగలుగుతారా అంటే.. లేదు.. కేవలం అప్పటికప్పుడు బురదజల్లడానికి వారి ఇమేజ్ను దెబ్బతీయడానికి మాత్రమే దాన్ని ఉపయోగిస్తున్నారు. ఏమీ లేకపోయినా.. దాడులు చేసి.. లేని పోని ప్రచారాలు చేసి.. తర్వతా ఏ వివరణ ఇవ్వకుండా వెళ్లిపోతున్నారు. కొన్ని రోజులుగా.. ఐటీ దాడులు జరగడం.. ఆ వెంటనే జీవీఎల్ అనే పెద్ద మనిషి వచ్చి ఆరోపణలు చేయడం కామన్‌గా మారిపోయింది. నిజంగా అవినీతి, అక్రమాలు ఉంటాయో ఉండవో కానీ.. ” వ్యక్తిత్వ హననం” మాత్రం.. ఈ దాడుల్ని అడ్డం పెట్టుకుని చేసేస్తారు. తర్వాత వివరణ అడిగినా.. పట్టించుకోరు.
కక్ష సాధింపు సోదాలు అయితే సానుభూతి వచ్చేది కాదా..?
అయినా సరే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ జీవో జారీ చేయకుండా ఉండాల్సిందనే అభిప్రాయం ఉంది. ఇది ఎన్నికల సమయం . కేంద్రం కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటప్పుడు.. కేంద్రం ఎంతగా దాడి చేస్తే.. చంద్రబాబుపై అంతగా సానుభూతి పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. న్యాయబద్ధంగా ఎదుర్కొంటే సరిపోతుందని.. లేని పోని విమర్శలు రాకుండా… మొత్తానికే.. సానుభూతి వచ్చేదని చెబుతున్నారు. అయితే ప్రత్యేకంగా.. ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా .. విమర్శలు వస్తూనే ఉంటాయి. సీబీఐ దాడులు జరిపిన తర్వాత.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో ఇరుక్కున్న తర్వతా.. ఎంత గగ్గోలు పెట్టినా పట్టించుకునేవారు ఉండరని.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడమే మంచిదని… టీడీపీలోని ఓ వర్గం వాదిస్తోంది. మొత్తానికి చంద్రబాబు నిర్ణయం కరెక్ట్ కాదా.. అన్నది ప్రజలే నిర్ణయించాలి.