మాది సంక్షేమ రాజ్యం అని చెప్పుకోవడానికి మన పాలకులు అందరూ కూడా తెగ తాపత్రయపడుతూ ఉంటారు. సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అంటే ఏంటి అనేదానికి మిగతా వాళ్ళ సమాధానం ఎలా ఉన్నా నరేంద్రమోడీ నుంచీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకూ అందరిదీ ఒకటే ఆన్సర్. అంతకుముందు పాలకులది కూడా అదే డైలాగ్. రూపాయికి బియ్యం ఇస్తున్నాం, పండగలకు తక్కువ ధరలకు సరుకులు ఇస్తున్నాం, పెన్షన్స్ ఇస్తున్నాం అని చెప్తారు. ఇక ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం భిక్షంలా వేస్తాం అని చెప్పే సైకిళ్ళు ఇస్తాం, సెల్ ఫోన్స్ ఇస్తాం, గ్రైండర్స్, మిక్సీలు, టీవీలు….అన్నీ ఫ్రీ…ఫ్రీ…ఇదీ మన పాలకుల వరస. ఈ పథకాలన్నీ కూడా ఓటర్లను బిచ్చగాళ్ళను చేసేవే. కష్టపడి పనిచేసుకునేవాడికి చేయూతనందించే ప్రయత్నాన్ని మన పాలకులు ఎప్పుడూ చేయరు. అయితే ఖాళీగా ఉండే జనాభాకు ఉచితాలు…లేదా బడా బడా వ్యాపారస్తులకు మరికొన్ని వేల కోట్లు సంపాదించడానికి రాయితీలు. మాల్యా, సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావులాంటి వాళ్ళకు కోట్లాది రూపాయల రుణాలు ఇవ్వడానికి మన బ్యాంకులు పోటీ పడతాయి. కష్టపడి పనిచేసుకునే రైతుకు మాత్రం పదివేల రుణం ఇవ్వడానికి కూడా మనసొప్పదు. ఇక వసూళ్ళు చేసే విషయంలో కూడా చాలా వైరుధ్యం ఉంటుంది. సుజనా, గంటా, మాల్యాలాంటి వాళ్ళు ఎన్ని వేల కోట్లు ఎగ్గొట్టినా ఈ బ్యాంకుల వాళ్ళు, ప్రభుత్వాలు వాళ్ళను ఏమీ చేయలేవు కానీ బ్యాంక్ ఉద్యోగుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులు మాత్రం వేలాది మంది కనిపిస్తారు.
ప్రజలను సంక్షోభం వైపు నడిపిస్తున్న ఇలాంటి సంక్షేమ పథకాల గురించే ఇప్పుడు పవన్ ప్రశ్నించాడు. కేవలం ఒక వందకోట్లతో పరిష్కారం లభించే సమస్యను దశాబ్ధాలుగా ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు అని ప్రశ్నించాడు. గోదావరి, కృష్ణా పుష్కరాల కోసం ఖర్చు చేసిన బడ్జెట్లో సగం బడ్జెట్‌తో ఉద్ధానం ప్రజల సమస్యను పరిష్కరించొచ్చు అని మేధావులు చాలా సార్లు చెప్పారు. రీసెంట్గా క్రిస్టమస్ పండగ టైంలో కూడా చర్చిలు కట్టిస్తాం, చర్చిలు కట్టుకోవడానికి స్థలాలిస్తాం అని వరాల వర్షం కురిపించేశాడు చంద్రబాబు. చర్చిలు, గుడులు, మసీదులు కట్టించి ప్రజలను ఎలా సంక్షేమం వైపు నడిపిస్తారో తెలియదు. లేకపోతే మా చేతుల్లో ఏమీ లేదు అందరూ కూడా ఆ కనిపించని దేవుళ్ళనే నమ్ముకోండి అన్న అంతర్గత సందేశం ఏమైనా ఇస్తున్నారేమో తెలియదు. మళ్ళీ ఇప్పుడు చంద్రన్న సంక్రాంతి కానుకలని వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆ కానుకలతో హెరిటేజ్ సంస్థకు ఎన్ని లాభాలు ఉన్నాయి అనే విషయం కూడా ప్రతిసారీ చర్చనీయాంశం అవుతోంది. అవినీతి కంపు కొడుతున్న ఆ కానుక వస్తువులు మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి.
టెక్నాలజీ, క్యాష్‌లెస్ కంట్రీ అంటూ ప్రజలందరూ కూడా అప్డేట్ అవ్వాలి, అభివృద్ధివైపు దూసుకెళ్ళాలి అని చెప్పే చంద్రబాబుకు, అభివృద్ధి కార్యక్రమాలను అధ్యయనం చేయడానికి అని చెప్పి అస్తమానూ విదేశాలు తిరుగుతు ఉండే బాబుగోరికి అభివృద్ధి చెందిన దేశాల్లో సంక్షేమ పథకాలు ఎలా ఉంటాయో తెలియదా? విద్య, వైద్యం కోసం బడ్జెట్లో వాళ్ళు ఎంత ఎక్కువ శాతం నిధులు కేటాయిస్తారో తెలియదా? పుష్కరాలతో వచ్చే సంక్షేమం ఏంటి? ఆ పుష్కరాలను, పండగలను ప్రభుత్వమే నిర్వహించాలని ఎవరు చెప్పారు? వందలాది కోట్లు అనవసరమైన విషయాల కోసం ఖర్చు పెడుతున్న చంద్రబాబు కేవలం వంద కోట్ల రూపాయలతో కిడ్నీ బాధితుల సమస్యను పరిష్కరించలేడా? పవన్ అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం ఏంటో తెలియదు కానీ ప్రస్తుతానికి పవన్‌కి అయితే మాత్రం మంచి మార్కులు పడ్డాయి. విపక్షాలంటే ఓదార్పుయాత్రలు, పరామర్శయాత్రలే కాకుండా మీడియావాళ్ళు, ప్రభుత్వం ఎప్పటికప్పుడు మర్చిపోతున్న సమస్యలను మళ్ళీ హైలైట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. బాధితుల గోడును ఎప్పటికప్పుడు పాలకులకు తెలియచేస్తూ ఉండాలి. వేలాది ప్రజలు దశాబ్ధాలుగా ఎదుర్కొంటున్న ఓ సమస్యను, ఆ ప్రజల గోడును ప్రపంచానికి తెలియచేయడంలో మాత్రం పవన్ కళ్యాణ్ వందశాతం సక్సెస్ అయ్యాడు.