ప్రధానమంత్రి పదవి రేసులో తాను లేనని.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. ఢిల్లీలో మీడియాకు ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీల కూటమిలో మోడీ కంటే.. ఎంతో మెరుగైన లీడర్లు చాలా మంది ఉన్నారని.. చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్న సమయంలో.. ఢిల్లీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అందరి దృష్టి… ప్రాంతీయ పార్టీల నేతలపైనే పడుతోంది. ఈ సారి.. ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారబోతున్నాయన్న స్పష్టత వచ్చిన సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలు కీలకమేనని జాతీయ మీడియా అంచనాకు వచ్చింది.
ప్రధాని పదవి ఆశలు పెట్టుకున్న మమతా బెనర్జీ, మాయావతి..!
ప్రాంతీయ పార్టీల్లో ఈ సారి ప్రధానంగా.. పదవిపై ఆశలు పెట్టుకుంది మహిళా లీడర్లే. వారే తమ ఆసక్తిని నేరుగా బయటకు వెల్లడిస్తున్నారు కూడా. బీఎస్పీ అధినేత్రి మాయావతి … రెండు రోజుల కిందటే.. ప్రధాని పదవిపై తన ఆశను వెల్లడించారు. ఏ చిన్న అవకాశం వచ్చినా.. ఆమె వదిలి పెట్టే అవకాశం లేదు. అలాగే.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా… దేశ అత్యున్నత అదికార పీఠంపై ఎప్పుడెప్పుడు కూర్చుందామా అని ఎదురు చూస్తున్నారు. ఆమె తన లక్ష్యం అదేనని ఎప్పుడో ప్రకటించారు. మోడీని ఎదుర్కోవడంలో.. తనదైన మార్క్ చూపించి.. దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ప్రాంతీయ పార్టీల మధ్య ముందే విబేధాలు రాకుండా చంద్రబాబు వ్యూహం..!
ప్రధాని పదవిపై.. నేరుగా.. తమ ఆశల్ని చెప్పేవారున్న సమయంలో.. ఇప్పుడు… తాను కూడా రెడీ అంటే… ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రాంతీయ పార్టీల పరిస్థితి మారిపోతుంది. అందుకే చంద్రబాబు అత్యంత వ్యూహాత్మకంగా … ప్రధాని పదవి అంశం తెరపైకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒక్క సారి.. ప్రధాని పదవిపై.. ప్రాంతీయ పార్టీల్లో చర్చ జరిగితే.. అది.. ఎటు వైపు తిరుగుతుందో చెప్పడం కష్టం. ఇలాంటి పరిస్థితి కోసం బీజేపీ ఎదురు చూస్తూ ఉంటుంది. పార్టీలను.. తన వైపు లాగేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. మోడీ, అమిత్ షా వ్యూహాలు.. చంద్రబాబుకు బాగా తెలుసు కాబట్టి… ఈ విషయంలో… చంద్రబాబు విరుగుడు ప్లాన్లు అమలు చేస్తున్నారని అనుకోవచ్చు.
చంద్రబాబుకు నిజంగానే ప్రధాని పదవి వద్దా..?
తాను ప్రధానమంత్రి పదవి రేసులో లేనని.. చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. నిజానికి.. అలాంటి ఆశ లేని రాజకీయ నేత ఎవరూ ఉండరు. గతంలో తనకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చినా వద్దనుకున్నానని… చంద్రబాబు చెబుతూ ఉంటారు. అప్పటి పరిస్థితులు వేరు. ఆ ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని.. చంద్రబాబుకు తెలుసు కాబట్టే.. ప్రధాని పదవి తీసుకోలేదని… రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఈ సారి.. అలాంటి పరిస్థితి వస్తే.. చాలా పక్కాగా… తీసుకోవడానికి చంద్రబాబు రెడీ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాహుల్ గాంధీతో… చంద్రబాబు ఎక్కువగా ర్యాపో మెయిన్ టెయిన్ చేయడానికి కూడా ఇదే కారణం అంటున్నారు.