భారత్‌లోని ప్రముఖుల వ్యక్తిగత సమాచారం మొత్తం చైనా సేకరించేసిందనే ప్రచారం ఊపందుకుంది. పరిశోధించి మరీ చెబుతున్నామంటూ ఇంగ్లిష్ దినపత్రిక ప్రచురించిన వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. చైనా నిఘా పెట్టి సమాచారం సేకరించిన ప్రముఖుల్లో ప్రధాని నరేంద్రమోదీతో పాటు రాష్ట్రపతి కోవింద్, సోనియా గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఉద్ధవ్ ఠాక్రే ఇలా కేబినెట్ మంత్రులు, విపక్ష నాయకులు, సీఎంలు.. రాజకీయ నేతలు.., త్రివిధ దళాల ప్రముఖులు ఉన్నారు. ఇలా మొత్తంగా 10 వేల మందిని చైనా టార్గెట్ చేసిందని చెబుతున్నారు. అయితే ఈ సమాచారం అంతా ఓపెన్ సోర్స్ ద్వారా సేకరిస్తోంది… సీక్రెట్‌గా కాదు. అంటే మన మీడియాలో వచ్చేదాన్ని.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాటిని తీసుకుని ఎనాలసిస్ చేసుకుంటోందన్నమాట.
ఓపెన్ సోర్స్ సమాచారం సేకరించడం వల్ల సీక్రెట్స్ ఏమీ తెలియవు. బయటకు చెప్పాలనుకునేవే తెలుస్తాయి. అయితే ఈ డేటాను ఎనలైజ్ చేస్తే అనేక విషయాలు బయటకు వస్తాయని ఇది అత్యంత ప్రమాదకరమని కొంత మంది నిపుణులు అంటున్నారు. ఈ సమాచారం ఆధారంతో సోషల్ మీడియాలో ఆయా వ్యక్తుల్ని టార్గెట్ చేయవచ్చని.. దేశ రాజకీయాల్లో ఒకరిపై ఒకరికి విద్వేషాన్ని పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. తద్వారా ఆయా దేశాల అంతర్గత విషయాల్లో తలదూర్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు చైనా పన్నాగమని చెబుతున్నారు.
భారత్ మాత్రమే కాదు..! ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ వాసులపైనా నిఘా పెట్టింది ఈ కంపెనీ. బ్రిటన్‌లో ప్రధాని బోరిస్ జాన్సన్, సహా వేలాది మంది ప్రముఖులపై చైనాకు చెందిన ఓ సంస్థ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తేలింది. ప్రముఖ నేతల కుటుంబాలకు చెందిన సమాచారాన్ని సైతం ఇవి కూడగడుతున్నట్లు చెబుతున్నారు. చైనా ఇలా చేస్తుందనే తెలిసే.. యాప్స్‌ను నిషేధించామని ఇదేమంత పెద్ద విషయం కాదని భారత్ అంటోంది. ఇతర దేశాలు కూడా.. చైనా యాప్స్‌ను నిషేధిస్తున్నాయని చెబుతున్నారు. ముందు ముందు చైనా కుట్రలు ఇంకెన్ని బయటపడతాయో..? అసలు నిజంగా చైనా ఇన్ని కుట్రలు చేస్తుందా.. లేక ఇలా చేస్తోందని ప్రపంచం భయపడుతోందా..? అన్నది కూడా ఆసక్తికరమే…!