చిరంజీవి.. రజనీకాంత్. ఇద్దరూ సమకాలికులే. ఎవరి భాషల్లో వాళ్లు సూపర్ స్టార్లు. తెలుగులో చిరంజీవి విశ్వరూపం చూపిస్తే.. తమిళ నాట రజనీ తన తఢాకా ప్రదర్శించాడు. ఇద్దరి వయసూ ఇంచుమించుగా ఒకటే. ఇద్దరూ మంచి మిత్రులు కూడా. చిరు రాజకీయాల్లోనూ వచ్చి… వెనక్కి వెళ్లిపోతే, రజనీ `వస్తున్నా.. వస్తున్నా..` అని ఊరిస్తూ డ్రాపయిపోయాడు. ఇప్పటికీ వీళ్ల ఇమేజ్, స్టార్ డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అలానే ఉంది. కానీ ఒకటే సమస్య. అదే అది పెద్ద సమస్య.
ఇటు చిరుని గానీ, అటు రజనీని గానీ హ్యాండిల్ చేసే దర్శకులు ఇప్పుడు కనిపించడం లేదు. దర్శకుల ఎంపిక విషయంలో ఇద్దరూ తప్పులు చేస్తూ వస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమని ఏకఛత్రాధిపత్యంగా ఏలేశాడు చిరంజీవి. కోదండరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, గుణ శేఖర్, బి.గోపాల్, వినాయక్… ఇలా ప్రతీ తరంలోనూ చిరంజీవిని అభిమానులకు నచ్చేలా చూపించడానికి ఓ దర్శకుడు ఉండేవాడు. తనకు ట్యూన్ అయిన దర్శకులతో వరుసగా సినిమాలు చేసి హిట్టు కొట్టేవాడు చిరు. అటు రజనీకాంత్ కూడా అంతే. సురేష్ కృష్ణ, కె.ఎస్.రవికుమార్‌లు.. రజనీని ఆకాశమంత ఎత్తులో చూపించేశారు. ఇక కొత్త యాంగిల్ ఏమీ లేదేమో… అన్నట్టుగా 360 డిగ్రీల్లో అన్ని కోణాలూ ఆవిష్కరించేశారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న దర్శకులంతా.. రజనీ ఇమేజ్ ముందు… ఆముదం వృక్షాలే. వాళ్లకున్న టాస్క్ అంతా ఇంతా కాదు. ఇది వరకు.. రజనీని ఎలా చూశారో అలానే చూపిస్తే కిక్ ఉండదు. ఈతరం వాళ్లకు ఆ మ్యాజిక్ అర్థమూ కాదు. కొత్తగా చూపిస్తే.. అది రజనీ ఇమేజ్‌కి వర్కవుట్ కాదు. అలా… గత కొన్నేళ్లుగా రజనీ ఫ్లాపుల్ని ఎదుర్కొంటూ వస్తున్నాడు.
ఇటు చిరంజీవి లైనప్ చూస్తే… అభిమానులకు బేజారొచ్చేస్తోంది. బాబి, మెహర్ రమేష్, వెంకీ కుడుముల, మోహన్ రాజా, మారుతి.. ఇదీ చిరు లైపప్. వీళ్లపై ఎవరిపైనా గుడ్డిగా నమ్మకాలు పెట్టుకోలేం. ఇది వరకు వీళ్లెవరూ మాస్ సినిమాల్ని తీసి, సూపర్ హిట్లు కొట్టిన చరిత్ర లేదు. అసలే `ఆచార్య` ఇచ్చిన షాక్ తో బెంబేలెత్తిపోయిన మెగా అభిమానులు ఈ లైనప్ చూసి.. మరింత బెంగ బెట్టుకొంటున్నారు. రజనీకీ, చిరుకీ ఉన్న వ్యత్యాసం ఒక్కటే. రజనీ యేడాదికి ఓ సినిమా చేస్తున్నాడు. చిరు…వరుసగా మూడు సినిమాల్ని చేతిలో పెట్టుకొన్నాడు. మరో రెండు మూడేళ్ల వరకూ ఈ సినిమాలతోనే చిరు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. మరి ఆ తరవాతేంటి? చిరుకి వయసు సహరిస్తుందా? చిరుని హ్యాండిల్ చేసి హిట్లు ఇవ్వగల దర్శకులు అప్పుడైనా వస్తారా? అసలు 70 దాటాకా.. చిరుని చూడడానికి అభిమానులు సిద్ధంగా ఉంటారా? ఇవన్నీ శేష ప్రశ్నలే.
చిరంజీవి – రాజమౌళి, చిరంజీవి – త్రివిక్రమ్, చిరంజీవి – బోయపాటి శ్రీను.. ఇది కదా చూడాల్సిన లైనప్. వీళ్లతో సినిమాలు చేస్తే కదా ఫ్యాన్స్‌కి మజా వచ్చేది. చిరు తన ముఫ్ఫై ఏళ్ల కెరీర్లో… ఒకేసారి ఇంతమంది కొత్తవాళ్లకు,యంగ్ జనరేషన్‌కి ఛాన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి.. ఇప్పుడే ఎందుకు ఇలాంటి స్టెప్పు తీసుకోవాల్సివస్తోంది..? అనేదే అంతు చిక్కడం లేదు.
చిరు, రజనీ.. ఇద్దరూ తెలుసుకోవాల్సిన నీతి ఒక్కటే. వాళ్లు స్టెప్పులు వేస్తామంటే ఇప్పుడు కుదరదు. నిలబడి నాలుగు మాస్ డైలాగులు చెబుతామంటే… వినరు. ఎప్పటిలా కమర్షియల్ కథల్లో, హీరోయిన్లతో డ్యూయెట్లు పాడేస్తామంటే బండి నడవదు. ఓ వైపు అమితాబ్ బచ్చన్, మరోవైపు మమ్ముట్టి, మోహన్ లాల్.. తమని తాము ఎలా మార్చుకున్నారో, తమని తాము ఎలా ఎలివేట్ చేసుకుంటున్నారో వీరిద్దరూ గమనించాలి. వాళ్లూ వాళ్ల వాళ్ల సీమల్లో సూపర్ స్టార్లే. వయసు పెరిగాక.. దానికి గౌరవం ఇచ్చారు. తమకు తగిన పాత్రల్ని ఎంచుకుంటున్నారు. రజనీ, చిరు… అచ్చంగా ఇప్పుడు అదే చేయాలి. వయసుకి తగిన పాత్రల్ని ఎంచుకోవాలి. హుందాతనం ప్రదర్శించాలి. అప్పుడే వాళ్లకోసం కథలు పుడతాయి. ఆ కథల్లో వాళ్లు మెరుస్తారు. కథలకూ కొత్త మెరుపు తీసుకొస్తారు. మరి…. ఆ రోజులు ఎప్పుడొస్తాయో..???