చిరంజీవి రీ ఎంట్రీ అదిరిపోయింది. చిరు స్టామినా, అతనిపై పెంచుకొన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని ఖైదీ నెం.150 నిరూపించింది. ఎవరు అవునన్నా, కాదన్నా.. ఖైదీ నెంబర్‌తో నెంబర్ వన్ పొజీషన్‌కి ఇప్పటికీ తాను అర్హుడనే అనిపించుకొన్నాడు చిరు. అయితే.. ఖైదీ నెం.150 పేరుతో వినిపిస్తున్న రికార్డులే మరీ అతిశయం కలిగిస్తున్నాయి. బాహుబలి తరవాత అంత గొప్ప వసూళ్లు సౌత్ ఇండియాలో తమకే దక్కాయని చిత్రబృందం ప్రచారం చేసుకోవడం ట్రేడ్ వర్గాల్ని సైతం విస్మయపరుస్తోంది. చిరు సినిమాకి టోటల్‌గా రూ.165 కోట్లకు పైచిలుకు వసూళ్లు వచ్చాయని, ఒకే ఒక్క భాషలో విడుదలై.. ఇన్ని వసూళ్లు సాధించిన చిత్రం తమదే అంటూ చిత్ర బృందం ప్రచారం చేసుకొంటోంది. బాహుబలి చాలా భాషల్లో విడుదలైంది కాబట్టి.. ఈ రికార్డు ఆ సినిమాకి వర్తించదన్నమాట.
బాహుబలి తరవాత నెంబర్ 2 పొజీషన్ కచ్చితంగా చిరు సినిమాదే. అందులో ఎలాంటి డౌటూ లేదు. కానీ సౌత్ ఇండియాలోనే తమని మించిన సినిమాలేదని చిత్రబృందం ప్రకటించేకోవడమే కాస్త అతి చేసినట్టు అనిపిస్తోంది. రోబో, ఐ చిత్రాలు దాదాపు రూ.150 కోట్లకుపైగానే వసూలు చేశాయి. కబాలి ఫ్లాప్ అయినా.. వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. అయితే ఖైదీ టీమ్ మాత్రం.. కబాలి, ఐ, రోబో తెలుగు, తమిళ భాషలు కలిపి చేసినన్ని వసూళ్లు ఖైదీ నెంబర్ ఒక్క తెలుగులోనే సాధించిందని చెబుతోంది. ఈ లెక్కలన్నీ ఫేక్ అని.. ఖైదీ వసూళ్లు మొత్తం మాయ అని నాన్ చిరంజీవి ఫ్యాన్స్ కొత్త లెక్కలు చెబుతున్నారు. ఎవరు నెంబర్ వన్, ఎవరు 2 అంటూ కొత్త చర్చని లేవదీస్తున్నారు. నిజానికి చిరుకి ఈ ఫేక్ రికార్డుల అవసరం ఏమాత్రం లేదు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం తరవాత ఓ సినిమా చేసి, అదీ రీమేక్‌ని ఎంచుకొని… అద్భుతమైన విజయం సాధించాడు. ఆ సినిమా వంద కోట్లు తెచ్చుకొంది. యంగ్ హీరోలు ఆపసోపాలు పడి అందుకొన్న వంద కోట్ల మార్క్… చిరు రీ ఎంట్రీతో ఉఫ్ అనిపించాడు. అది చాలదూ.. చిరు స్టామినా ఎంతో చెప్పడానికి.