ఓడలు బళ్లవడం, బళ్లు ఓడలు అవ్వడం… ఎక్కడైనా కాస్త లేట్ అవుతుందేమో గానీ, చిత్రసీమలో కాదు. ఓ హిట్టుతో `వాడంత తోపు గాడు లేడు` అన్నవాళ్లే.. ఒక్క ఫ్లాప్‌తో… `వీడి చాప్టర్ అయిపోయింది` అనడం ఒక్క ఫిల్మ్ నగర్లోనే కనిపిస్తుంది. చిరుకీ ఇప్పుడు ఈ విమర్శలు తప్పడం లేదు.
ఆచార్య ఫ్లాప్ అయ్యింది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఈ విషయంలో డివైడ్ టాకే లేదు. చిరు ఫ్యాన్స్ కూడా.. ఈ సినిమా చూసి పెదవి విరుస్తున్నారు. అయితే అక్కడితో ఆగడం లేదు. `చిరు పనైపోయింది… స్టామినా తగ్గిపోయింది..ఇక సినిమాలు మానేయడం బెటర్` అంటూ ఇంకో మెట్టు ఎక్కి, విమర్శనా బాణాలు ఎక్కు పెడుతున్నారు. చిరు రిటైర్మెంట్ తీసుకోవాలని వాళ్లకు వాళ్లే డిక్లేర్లు చేస్తున్నారు. నలభై ఏళ్ల ప్రస్థానం.. దాదాపు మూడు దశాబ్దాలుగా నెంబర్ వన్ స్థానం.. ఇవన్నీ మర్చిపోయి… ఒక్క ఫ్లాప్ తోనే చిరు స్టామినాని డిసైడ్ చేయడం.. దారుణం.
ఫ్లాపులు ఎవరికి లేవు..? డిజాస్టర్లు ఎవరికి రావు? దీనికి చిరు అతీతుడేం కాదే..?
దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరవాత.. ఖైదీ నెం.150 సినిమా చేస్తున్నప్పుడు జనం ఏమన్నారు? ఇదే మాట కదా.. ఇప్పుడు కూడా చిరు అమ్మడూ – కుమ్ముడూ లాంటి పాటల్లో డాన్సులు చేయడం అవసరమా? ఇప్పటికీ రీమేక్ కథలనే నమ్ముకోవాలా..? ఇంకా గ్లామర్ హీరోగా కనిపించాలని తాపత్రయపడాలా? అని కశ్చన్ చేశారు. కానీ.. ఆ సినిమా సూపర్ హిట్ ని ఆ కామెంట్లు అడ్డుకోగలిగాయా? అమ్మడూ కుమ్ముడూ అంటూ చిరు బెల్ట్ స్టెప్ వేస్తే.. అంతా బెండైపోయి.. చూస్తూ కూర్చున్నారు. ఈ ఏజ్ లో ఆ గ్రేస్ ఏమిటి? ఇంత గ్యాప్ తరవాత వచ్చినా, ప్రజారాజ్యం ఫ్లాప్ తరవాత సినిమా తీసినా.. ఆ వసూళ్లేంటి అని ఆశ్చర్యపోయారు..? చిరు చిరునే… అంటూ కితాబులు ఇచ్చారు. నెంబర్ వన్ స్థానం ఆయనకే మళ్లీ కట్టబెట్టారు. సైరా ఫ్లాపే. కానీ.. గౌరవం మాత్రం పోకుండా చిరు జాగ్రత్త పడ్డారు. ఓ యోధుడి కథని చెప్పడానికి చేసిన ప్రయత్నం .. ఆ సినిమా విజయాన్ని ఆర్థిక పరమైన లెక్కలతో బేరీజు వేయకుండా అడ్డుకోగలిగింది.
ఇప్పుడు ఆచార్య విషయానికొద్దాం. చిరు చేసిన తప్పేమిటంటే.. ఇలాంటి కథని ఎంచుకోవడం అంతే. నటుడిగా చిరు ఎక్కడా తప్పు చేయలేదు. డాన్సర్ గా ఎక్కడా తగ్గలేదు. ఒకే ఒక్క సీన్ లో అయినా తన కామెడీ టైటింగ్ ఏపాటిదో చూపించగలిగాడు. నటుడిగా ఫెయిల్ అయితే అప్పుడు ఎన్ని విమర్శలు చేసినా.. తప్పులేదు. ఇక్కడ ఫెయిల్ అయ్యింది. కథ… అంతే తప్ప హీరో కాదు. ఆ మాటకొస్తే… ఇందులో దర్శకుడిగా కొరటాల బాధ్యత కూడా ఉంటుంది. అలాగని.. కొరటాలకు సినిమాలు తీయడం చేతకాదనే ముద్ర వేస్తారా?
నలభై ఏళ్ల ప్రయాణం.. అలు పెరుగని స్వయం కృషి… ఎంతమందికో ఆదర్శప్రాయమైన జీవితం.. ఎవరికీ సాధ్యం కాని రికార్డులు…
వీటన్నింటినీ ఒక్క ఫ్లాప్ తో తుడిచేయాలని చూడడం కచ్చితంగా అవివేకమే.
చిరు తన కాళ్లమీద తాను నిలబడిన హీరో. తనంతట తానే నడక నేర్చుకుని, పడుతూ, లేస్తూ.. పరుగులు పెట్టిన హీరో.
ఎక్కడ పరుగు అందుకోవాలో.. ఎక్కడ పరుగు ఆపేయాలో.. చిరుకి మాత్రమే బాగా తెలుసు. ఈ విషయంలో ఎవరి సలహాలూ సానుభూతులు చిరంజీవికి అవసరం లేదు.