ఏపీ సీఎం జగన్ ఎప్పుడైనా నిద్రలేచి అసెంబ్లీని రద్దు చేస్తారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చని సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు చంద్రబాబు చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం టీడీపీ నేతలు పగటి కలలు కంటున్నారని విమర్శిస్తున్నారు. కానీ సీఎం జగన్ కార్యాచరణ మాత్రం ముందస్తు వైపే ఉందన్న సంకేతాలు వస్తూండటంతో వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికలకు ఇంకారెండేళ్లకుపైగానే సమయం ఉన్నప్పటికీ అందరూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు.
పదో తేదీన శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు ఏమేం చేయాలో చెప్పనున్నారు. రెండు, మూడు నెలల్లోనే అందరూ నియోజకవర్గాలను చుట్టేయాలని చెబుతున్నారు. ప్లీనరీ కంటే ముందే నియోజకవర్గాన్ని చుట్టేయాలని చెబుతున్నారు. వైఎస్ వర్థంతి సందర్భంగా ప్లీనరీని ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. అభివృద్ధి విషయంలో గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేకపోవడంతో నియోజకవర్గానికి రూ.2 కోట్ల చొప్పున అభివఅద్ధి నిధులు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లోని గ్రామాలన్నింటినీ సందర్శించాలని అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు.
ఇప్పటికే సర్వేలు.. ఇతర మార్గాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి.. పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ కూడా ముందస్తుకు వెళ్లే ఆలోచనలు చేస్తూండటం అన్నీ కలిపి ఏపీ ప్రభుత్వ వర్గాలను కూడా ముందస్తు వైపు మళ్లించేలా చేస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇది నిజమో కాదో కానీ.., కేసీఆర్ తరహాలో పథకాలు.. శంకుస్థాపలను కూడా సీఎం జగన్ చేపడితే ముందస్తు సంకేతాలని గట్టిగా భావించే అవకాశం ఉంది.