తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్.. దీక్ష నేటితో పదకొండో రోజుకు చేరుకుంది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వైద్యులు..అన్ని రకాల వైద్య పరికరాలను ఆయన అమర్చి.. ఎప్పటికప్పుడు… ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇక ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంటే.. ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కేంద్రం నుంచి ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఎలాంటి సానుకూల సంకేతాలు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచే సమాచారం రావాల్సి ఉందని చెప్పి.. కేంద్ర ఉక్కు మంత్రి మొక్కుబడి ప్రకటన చేసి చేతులు దులిపేసుకున్నారు. ఎలాంటి సమారం కావాలన్నా.. నిమిషాల్లో ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా..మెకాన్ సంస్థను మధ్యలో పెట్టి కేంద్రం దాదాపుగా తప్పించుకుంది.
ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అంచనా వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడు కడపకు వెళ్లే అవకాశం ఉంది. సీఎం రమేష్‌తో ఆయన దీక్షను విరమింపచేసే అవకాశం ఉంది. కేంద్రం నమ్మకద్రోహం చేసినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తుందని … చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల కిందట మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. వాస్తవానికి.. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రైవేటు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే… ఏ ఇతర స్టీల్‌ప్లాంట్‌కు లేనట్లుగా.. గనులు.. కడపలో అందుబాటులో ఉన్నాయి. కానీ విభజన చట్టంలో ఉంది కాబట్టే.. ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నదే తమ డిమాండ్ అని చంద్రబాబు చెబుతున్నారు.
మరో వైపు ఏపీ బీజేపీ నేతలు మాత్రం… కేంద్రం స్టీల్ ప్లాంట్ ఇస్తుందని.. టీడీపీకి తెలుసు కాబట్టే దీక్షలు చేశారని కవర్ చేసుకుంటున్నారు. అంత కచ్చితంగా తెలిసినప్పుడు… కేంద్రం కచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న ప్రకటన ఎందుకు చేయలేకపోతోందన్న విషయాన్ని మాత్రం బీజేపీ నేతలు చెప్పలేకపోతున్నారు. చేస్తున్న దీక్షలను కించ పరచడం తప్ప.. స్టీల్ ఫ్యాక్టరీ కోసం … ఒక్క బీజేపీ నేత కూడా ఢిల్లీ వెళ్లి ప్రయత్నించిన పాపాన పోలేదు. అందుకే సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. చంద్రబాబు ..ఈ రోజు కడప వెళ్లి దీక్ష విరమింప చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.