ఆయన ప్రజా నాయకుడు కాదు. ప్రజలతో అస్సలు సంబంధం లేదు. తన రాజకీయ ప్రయాణంలో ఏ నాడు ప్రజల నుంచి ఎన్నిక కాలేదు. అయినా, పార్టీలో కీలక నాయకుడుగా ఎదిగారు. ప్రజల మధ్య కాక నాయకుడు నీడలో పెరిగారు. లీడర్ అనడం కంటే లాబీయిస్ట్ అన్న ముద్ర బలంగా వేసుకున్నారు. వ్యాపారవేత్త నుంచి పొలిటికల్ లీడర్ గా మారారు. ఆయనే టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్. ఆయన ఫస్ట్ టైం ప్రజల మధ్యకు వస్తున్నారు. ప్రజల డిమాండ్ మేరకు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తూ ధీక్షకు దిగుతున్నారు సీఎం రమేష్.
సీఎం రమేష్ రాజకీయ జీవితంలో బహుశా ఇదే మొదటి ప్రజా పోరాటం అనుకుంటా ! ఆయన ఇన్నాళ్లు టీడీపీలో బ్యాక్ డోర్ పాలిటిక్స్ కు పెట్టింది పేరు. అన్నీ పార్టీల నేతలతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతూ కూడా చంద్రబాబు వద్ద పట్టు సాధించారు. తిమ్మిని బమ్మి చేయగల సమర్ధుడన్న పేరు తెచ్చుకున్నారు. 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ దశలో సీఎం రమేష్ ను చంద్రబాబు దూరం పెట్టారన్న ప్రచారం జరిగింది. అధికారంలోకి వచ్చీరావడంతోనే పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులకు సీఎం రమేష్ విందు ఇవ్వడమే దీనికి కారణంగా చెబుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. మళ్లీ రమేష్ సీఎంకు దగ్గరయ్యారు. చంద్రబాబు వద్ద తిరిగి పట్టు సాధించారు. ఎవరూ ఊహించని విధంగా రాజ్యసభ సీటు రెన్యూవల్ చేయించుకున్నారు. దీంతో ఆయన ఎంత గొప్ప లాబీయిస్టో అన్న ప్రచారం మరోసారి తెర మీదకు వచ్చింది. ఏదైతేనేమి మరోసారి రాజ్యసభ సభ్యుడుగా రమేష్ అవకాశం చేజిక్కించుకున్నారు. అయితే, అంతలోనే రమేష్ వ్యవహార శైలి పై కడప టీడీపీ నేతల్లో అసహనం పెల్లుబికింది. జిల్లా రాజకీయాల్లో రమేష్ పెత్తనం ఎక్కువైపోయిందన్న ఆగ్రహం, ఆవేదన వారిలో వ్యక్తమైంది. వరదరాజుల రెడ్డి లాంటి లీడర్లు ఈ విషయం పై నేరుగానే విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమస్యకు ‘కామా’ పెట్టాల్సివచ్చింది.
ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడని పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సీఎం రమేష్ కు అర్థమైనట్టుంది. అందుకే లాబీయిస్ట్ నుంచి పబ్లిక్ లీడర్ గా ప్రమోషన్ పొందే ప్రయత్నం మొదలుపెట్టినట్టున్నారు. ఫస్ట్ టైం పబ్లిక్ ఎజెండాతో ఆయన తెర మీదకు వచ్చారు. రాష్ట్ర విభజన సమస్యల పై అడపా దడపా రాజ్యసభలో మాట్లాడటం మినహా ఇప్పటి వరకు ఆయన నేరుగా ఏ ప్రజా ఆందోళనను లీడ్ చేయలేదు. కనీసం… ఏ ఆందోళనలోనూ పెద్దగా పాల్గొన్నది కూడా లేదు. కానీ, సడెన్ గా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఏకంగా ఆమరణ ధీక్షకు సిద్ధమై వార్తల్లో నిలిచారు. ఇక పై సీఎం రమేష్ ప్రజా నాయకుడుగా మారే ప్రయత్నం చేస్తున్నారా లేక తిరిగి లాబీయిస్ట్ లీడర్ పోస్టులోకే వెళ్లిపోతారా అన్నది చూడాలి.