తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమన్వయలోపంతో… అభాసు పాలవుతోంది. ప్రజాకర్షక హామీలు రూపొందించి.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నానా తిప్పలు పడుతోంది. తప్పుల మీద తప్పులు చేస్తే.. హామీల మీదే అవగాహన లేదు..ఇంకేం అమలు చేస్తారన్న స్థాయి విమర్శలను కొని తెచ్చుకుంటోంది. ఆదివారం నాటి పత్రికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ప్రకటనలు ఇచ్చింది. ప్రకటనల్లో.. ఇళ్ల నిర్మాణానికి వేర్వేరు విభాగాల కింద రూ. 5, రూ. 6 లక్షలు ఇస్తామని ప్రకటించింది. అయితే.. ఈ రూ. 5, రూ. 6 లక్షల పక్కన రుణం అని రాశారు. దీన్ని టీఆర్ఎస్ నేతలు వెంటనే అంది పుచ్చుకున్నారు. పేదలను ఇళ్ల పేరుతో అప్పుల పాలు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. తాము డబుల్ బెడ్రూం ఇళ్లను ఒక్క రూపాయి ఖర్చు కాకుండా నిర్మించి ఇస్తామంటున్నామని… కానీ కాంగ్రెస్ మాత్రం అప్పుగా ఇస్తానంటోందని విమర్శించారు. కేటీఆర్ కూడా.. దీన్ని ప్రత్యేకంగా ట్వీట్ చేసి.. కాంగ్రెస్ హామీలు అన్నీ అబద్దాలేనన్నట్లుగా విమర్శించారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా.. పఠాన్ చెరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ వాళ్లు అప్పిస్తామంటున్నారని.. తాము మాత్రం పూర్తి ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. వెంటనే.. కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్‌కు దిగింది. ఆ పార్టీకి చెందిన నేతలు ఎక్కడా క్లారిటీ ఇవ్వకపోయినా… ప్రజల్లోకి వెళ్లిపోతోందని గ్రహించి.. వెంటనే సోమవారం మరో భారీ ప్రకటన పత్రికలకు మంజూరు చేశారు. అదే ప్రకటన.. కాకపోతే.. రుణం అని ఉన్న చోట.. ఈ సారి ఉచితం అని పెట్టించారు. అంటే.. ఇళ్లకు రూ. 5, రూ. 6 లక్షలు ఉచితంగా ఇస్తామని హమీ అన్నమాట. అది రుణం కాదు.
రాజకీయాల్లో తప్పు చేసినా.. దాన్ని దిద్దుకున్నా.. విమర్శలు తప్పవు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీపై.. టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఒక్క రోజులోనే మాట మార్చిన కాంగ్రెస్ ఒక వేళ గెలిస్తే.. ఎన్ని పిల్లిమెగ్గలేస్తుందోనని సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అవగాహనా లోపంతో… ఇలాంటి పొరపాట్లు చేసి… విమర్శలకు గురవుతోంది.