130 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి… రోజులు గడవడానికి కూడా నిధుల కరువొచ్చిపడింది. కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉండి…ఆ అధికారాన్ని కోల్పోయిన నాలుగేళ్లకే.. ఆ పార్టీ ఖాజానా వట్టిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఓ మాదిరి రాష్ట్రం పంజాబే. మిగతా మరెక్కడా అధికారంలో లేదు. దాంతో రాష్ట్రాల నుంచి ఏఐసిసి నిధులు వచ్చే ప్రధానమైన మార్గం మూసుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందనే నమ్మకం .. నిన్నామొన్నటిదాకా కార్పొరేట్ కంపెనీలకు కూడా లేకపోవడంతో… విరాళాలివ్వడం పూర్తిగా తగ్గించేశారు. 2016-17 కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలు రూ.225 కోట్లు. అదే అధికారంలో ఉన్న బీజేపీకి వచ్చినది మాత్రం రూ. 1034 కోట్లు. పార్టీల విరాళాలకు ఎలక్టోరల్ బాండ్ల విధానం ప్రవేశపెట్టిన తర్వాత బీజేపీకి దాదాపుగా ఎనభై శాతం ఆదాయం పెరిగింది. అదే సమయంలో కాంగ్రెస్ కు పదిహేను శాతం విరాళాలు పడిపోయాయి.
అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్కు ఓ వ్యవస్థ ఉంది. పార్టీ కార్యాలయాలు, కార్యక్రమాల నిర్వహణ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఖర్చులన్నింటినీ తగ్గించేసింది. కార్యాలయల నిర్వహణకు నెలకు కొంత మొత్తం ఏఐసిసి నుంచి పంపేవాళ్లు. కానీ ఇప్పుడా కొద్ది మొత్తాన్ని కూడా నిలిపివేశారు. ఇక పార్టీ పనుల కోసం నేతల పర్యటనలను కూడా కుదించారు. అత్యవసరమైన ఎన్నికల పనులకూ… విమాన ప్రయాణాలను నియంత్రించేశారు. అన్నింటికీ మించి కార్యాలయాల్లో టీ, కాఫీలను ఇవ్వడం కూడా మానేశారంటే.. పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లే…!
ఈ విషయాన్ని నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ నేతలు గోప్యంగా ఉంచినా… ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జ్ .. దివ్య స్పందన కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బుల్లేవని డైరక్ట్ గా ప్రకటించారు. ఆ తర్వాత.. ఒక్కరోజునే కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్లో క్రౌడ్ ఫండింగ్ ట్వీట్ పెట్టింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తలా ఓ చేయి వేయాలంటూ… నేరుగానే అడిగేసింది. దీంతో.. ఆశ్చర్యపోవడం ప్రజల వంతయింది.
నిజానికి కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బుల్లేకపోవచ్చు.. కానీ ఆ పార్టీ నేతలు మాత్రం అపర కుబేరులే. అధికారంలో ఉన్నప్పుడు… అడ్డదిడ్డంగా సంపాదించిన వారెందరో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారందరూ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందేమీ ఉండదు. కానీ సంపాదించుకునే నేతలే కానీ… సాయం చేసే నేతలు ఆ పార్టీలో ఉండరు. అదే ఆ పార్టీలో ఉండరు. అదే ఆ గ్రాండ్ ఓల్డ్ పార్టీ చేసుకున్న దౌర్భాగ్యం. క్రౌడ్ ఫండింగ్ తో ప్రజలెంత సహకరిస్తారో వేచి చూడాల్సిందే..!!