తెలంగాణలో కరోనా పరిస్థితి రాను రాను తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాల తర్వాత కరోనా టెస్టులు బాగా పెంచినప్పటికీ.. పాజిటివ్ కేసులు మాత్రం చాలా తక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్లో మరీ తక్కువగా నమోదవుతున్నాయి. వారం.. పది రోజుల కిందట.. రోజుకు వెయ్యి కేసుల దరిదాపులో ఉండేది. ఇప్పుడు.. రోజుకు మూడు, నాలుగు వందల కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఇతర జిల్లాల్లోనూ తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ మొత్తం వెయ్యికి అటూ ఇటూగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి.
మరణాల సంఖ్య కూడా.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా పరిమితంగా ఉంటోంది. రోజుకు పది కరోనా మరణాలు రికార్డు కావడం లేదు. ఇప్పటి వరకూ.. తెలంగాణలో మొత్తం కరోనా కేసులు లక్ష కూడా నమోదు కాలేదు. మరణాల సంఖ్య 693. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22వేలు మాత్రమే ఉన్నాయి. వీరిలో అత్యధికులు హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. అనారోగ్య సమస్యలు ఉండి.. ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారిన వారిని మాత్రమే… ఆస్పత్రుల్లో చేర్చుకుంటున్నారు. అందుకే.. ఇలా చేరుతున్న వారిలో ఎక్కువ మందికి ఆక్సీజన్ అందించాల్సి వస్తోంది.
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సగం బెడ్లను స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి.. ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆస్పత్రులతో చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయి. అవి పూర్తయిన తర్వాత ఇక ఎక్కువ మంది రోగుల్ని.. ప్రైవేటు ఆస్పత్రులకు కూడా తరలించే అవకాశం ఉంది. మొదట్లో టెస్టులు సరిగ్గా చేయడం లేదని.. బాధితులకు వైద్యం అందడం లేదనే అసంతృప్తి ఎక్కువగా కనిపించినా.. ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా కంట్రోల్లోకి వచ్చినా రాకపోయినా.. అదుపుతప్పలేదనే భావన మాత్రం అధికారవర్గాల్లో ఏర్పడింది.