ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేత ధర్మపురి శ్రీనివాస్. కానీ, తెరాసలోకి వచ్చింది మొదలు… ఆయన ఆశించిన స్థాయి గుర్తింపు లేదనే చెప్పాలి. అందుకే ఆయన పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం చాన్నాళ్లుగా వినిపిస్తూ ఉంది. పార్టీ మారతారని కథనాలు రావడం.. అలాంటి ఆలోచన లేదని ఆయన ఖండించడం అనేది ఒక రొటీన్ వ్యవహారంగా మారిన సంగతీ తెలిసిందే. అయితే, డీఎస్ తీరుపై ఇటీవల తెరాస నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పార్టీ నుంచి వేటు వెయ్యాలంటూ తీర్మానించేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తన అనుచరులతో డీఎస్ మరోసారి సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ నగర శివార్లలోని ఒక రహస్య ప్రాంతంలో తన అనుచరులతో డీఎస్ ఓ సమావేశం నిర్వహించారని కథనాలు వినిపిస్తున్నాయి. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోవాలన్న అజెండాతోనే ఈ సమావేశం జరిగినట్టు సమాచారం. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేదానిపై ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, ఆయన మళ్లీ కాంగ్రెస్ లోకి చేరతారా.. లేదంటే, తన కుమారుడు అనుసరించిన మార్గంలో భాజపావైపు చూస్తున్నారనేది ఇంకా స్పష్టత రావాల్సింది.
నిజానికి, డీఎస్ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. తెరాస నేతలు తీర్మానం పంపినా.. దాని గురించి సీఎం పట్టించుకోవడం లేదు. అంతేకాదు, డీఎస్ కి కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా లభించడం లేదు. నిజానికి, ఓ పదిరోజుల కిందటే డీఎస్ ను కలవడానికి కేసీఆర్ కబురు పంపుతారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ, అది కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో అనుచరులతో డీఎస్ రహస్య సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం కొన్నాళ్లు వేచి చూద్దామా లేదా అనే అంశం ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. డీఎస్ విషయమై కేసీఆర్ ముందుగా స్పందిస్తే… అది తెరాస తరఫు చర్యగా ఉంటుందనీ, అప్పుడు కావాలనే తనను పార్టీ దూరం పెట్టేసిందనే విమర్శలకు ఆస్కారం ఏర్పడుతుందన్న వ్యూహంతోనే సీఎం ఎటూ తేల్చడం లేదన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఒకవేళ డీఎస్ తనకు తానుగా పార్టీ నుంచి బయటకి వెళ్లిపోయే నిర్ణయం తీసుకునే పరిస్థితి కల్పించడం ద్వారా విమర్శలుపాలు కాకుండా ఉండాలన్నది తెరాస వ్యూహమనీ కొందరు చెబుతున్నారు. దీంతో తాజా భేటీలో కూడా ఇదే సందిగ్ధత కొనసాగి ఉంటుందనే అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. మొత్తానికి, డీఎస్ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది కొద్దిరోజుల్లో స్పష్టత రావడం ఖాయంగానే కనిపిస్తోంది.