అన్వేషణ, సితార, ఏప్రిల్ 1 విడుదల, చెట్టు కింద ప్లీడర్.. ఇలా ఒకటా, రెండా?? వంశీ నుంచి వచ్చిన ఆణిముత్యాలెన్నో! తెలుగు దర్శకుల్లో తనకంటూ ఓ స్టైల్‌నీ, స్థాయినీ సంపాదించుకొన్నాడు వంశీ. తనకు ఇష్టమైన సినిమాలనే తీస్తాడు.. అంకె పెంచుకోవడానికో, బ్యాంక్ బ్యాలెన్స్కోసమో సినిమాలు తీసే రకం కాదు. అలాంటి వంశీకి ఈమధ్య హిట్ పడకపోవొచ్చు.. కానీ తనకంటూ ఆడియన్స్ ఉన్నారు. తనదైన రోజున మళ్లీ అద్భుతాలు సృష్టించగల సత్తా ఉంది. అలాంటి వంశీని చిన్న చూపు చూడడం భావ్యమా?? కానీ ఇప్పుడు అదే జరుగుతోంది.
లుడీస్ టైలర్‌కి సీక్వెల్‌గా ఫ్యాషన్ డిజైనర్ సినిమా తీద్దామని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు వంశీ. ముందు ఈ కథ రవితేజకి వినిపించాడు. తాను చేస్తా.. చేస్తా అంటూ హ్యాండిచ్చాడు. ఆ తరవాత రాజ్ తరుణ్ దగ్గరకు వెళ్లిందీ కథ. తాను కూడా ఒప్పుకొన్నాడు. కానీ షూటింగ్ మొదలెడదామంటే మీనమేశాలు లెక్కేశాడు. దాంతో వంశీకి తిక్కరేగి మరో హీరో కోసం అన్వేషణ మొదలెట్టాడు. ఇప్పుడీ కథ రామానాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడు అభిరామ్ దగ్గరకు వెళ్లింది. అభిరామ్‌కి ఇది వరకు ఎలాంటి అనుభవం లేదు. చూడ్డానికి కూడా హీరో ఫేస్ కాదు. కానీ ఏదో కొత్తగా ఉంటుందని ట్రై చేద్దామనుకొన్నాడు వంశీ. కానీ సురేష్ బాబు మాత్రం ”వంశీది మరీ ఓల్డ్ ఫ్యాషన్.. అభిరామ్ డెబ్యూ మూవీకి కొత్త దర్శకుడైతే బాగుంటుంది కదా?” అంటున్నాడట. వంశీ అంటే మరీ అంత చీప్ అయితే ఎలా? వెదుక్కొంటూ వచ్చి మరీ హీరోని అడిగితే – ఇన్ని బిల్డప్పులా?? చిత్రసీమలో అంతే. హిట్టుంటేనే విలువ. అనుభవం కంటే.. రెడీమెడ్ గా వచ్చిన విజయానికే ఎక్కువ విలువ. అది వంశీ విషయంలోనూ రుజువవుతోంది.