భారతీయ సినిమా రంగం సాహోరే బాహుబలి… అంటూ బాహుబలిని నెత్తిన పెట్టుకొంది. బాహుబలి ధాటికి పాత రికార్డులన్నీ చెల్లా చెదురైపోయాయి. ఇండియన్ బాక్సాఫీసు దగ్గర ఏకంగా రూ.1500 కోట్లు సాధించి కనీ వినీ ఎరుగని రికార్డుని సొంతం చేసుకొంది. ఇప్పట్లో బాహుబలి 2 రికార్డుల్ని బద్దలుకొట్టే సినిమా ఏదీ లేదని, భవిష్యత్తులోనూ రావడం కష్టమని ట్రేడ్ విశ్లేషకులు సైతం తేల్చేశారు. అయితే బాహుబలి 2 కంటే ముందే విడుదలైన దంగల్.. అనూహ్యంగా చైనాలో విడుదల అవ్వడం అక్కడ రికార్డు వసూళ్లు సాధించడం ఆ సినిమా కూడా 1000 కోట్లు.. 1300 కోట్లు సాధించి 1500 కోట్ల దిశగా అడుగులు వేయడం చూస్తుంటే బాహుబలి 2 రికార్డు అతి తక్కువ రోజుల్లో చెరిగిపోవడం ఖాయం అనిపిస్తుంది. చైనాలో దంగల్ ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. దంగల్ ప్రవాహం ఎప్పటికి ఆగుతుందో చెప్పలేం. ప్రస్తుతం దంగల్ – బాహుబలి 2కి ఉన్న అంతరం చాలా తక్కువ. ఒకట్రెండు రోజుల్లో దంగల్ బాహుబలి 2ని దాటేసినా దాటేయొచ్చు.
అయితే దంగల్ చైనాలో సృష్టిస్తున్న రికార్డులన్నీ నిజమేనా? లేదంటే నోటి కొచ్చిన అంకె చెప్పేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం బాహుబలి 2ని దాటేశాం అని చెప్పడానికి తప్పుడు లెక్కలు ఇచ్చినా ఇవ్వొచ్చని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఆమాటకొస్తే బాహుబలి 1500 కోట్లు సాధించిందని నిక్కచ్చిగా చెప్పడానికి రుజువులేమిటి? అని బాలీవుడ్ వాళ్లు కూడా ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎవరి లెక్కలు వాళ్లవి. ఎవరి రికార్డులు వాళ్లవి. కాకపోతే.. అటు బాహుబలి 2, ఇటు దంగల్ రెండూ… గొప్ప సినిమాలే. ఇక వాటిమధ్య పోటీలెందుకు..? రెండింటికీ జయహో.. అనేస్తే పోలా.