ఈ ఐపీఎల్ లో ప్లే ఆఫ్‌కి కూడా చేరుకోని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల్ని తీవ్ర నిరాశ లో ముంచెత్తింది. మూడు ఐపీఎల్ టైటిళ్లు గెలుచుకుని, ఏకంగా 5 సార్లు రన్నరప్‌గా నిలిచిన జట్టు… ఇంత పేలవమైన ఆటతీరు ప్రదర్శిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఏదైతేనేం.. ఈ ఐపీఎల్ గడిచిపోయింది. ఐపీఎల్ 2021కి అప్పుడే సన్నాహాలు మొదలైపోతున్నాయి. త్వరలోనే ఐపీఎల్ వేలం ఉంటుందని, ప్రాంఛైజీలకు బీసీసీఐ సంకేతాలు పంపేసింది.
కాకపోతే ఈసారి చెన్నై జట్టు కెప్టెన్ గా ధోనీ కొనసాగే అవకాశాలు కనిపించడం లేదు. ధోనీ ఆటగాడుగా ఉంటాడని, కెప్టెన్‌గా బాధ్యతలు మరొకరికి అప్పగిస్తాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సీజన్లో చివరి మ్యాచ్‌ల నుంచే ధోనీ తప్పుకుంటాడని అనుకున్నారు. కానీ క్లిష్టమైన పరిస్థితుల్లో తన జట్టుకు దూరంగా ఉండడానికి ధోనీ ఇష్టపడలేదు. పైగా.. సూపర్ కింగ్స్ యాజమాన్యం ధోనీపై నమ్మకం ఉంచింది. అందుకే పేలవమైన ప్రదర్శన కొనసాగుతున్నా.. కెప్టెన్స్ మార్పు కి సంబంధించన చర్చ రానివ్వలేదు.
కాకపోతే 2021 ఐపీఎల్ లో మాత్రం ధోనీ స్థానంలో కొత్త కెప్టెన్ ని చూసే అవకాశాలు లేకపోలేదు. ధోనీ స్థానంలో డూప్లెసిస్ కెప్టెన్‌గా ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారతజట్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ధోనీ.. కెప్టెన్సీ నుంచి తప్పుకుని, ఆ స్థానాన్ని కోహ్లికి ఇచ్చి, తాను ఆటగాడిగా కొన్నాళ్లు కొనసాగాడు. ఇప్పుడూ అదే థీరీ ఫాలో అవ్వబోతున్నాడని సమాచారం. ఈ వేలంలో స్టార్ ఆటగాళ్లని ప్రపంచ స్థాయి ఆటగాళ్లని చెన్నై జట్టు కైవసం చేసుకుని, అందులో డూప్లెసిస్ కంటే మెరుగైన కెప్టెన్ ఉండి ఉంటే గనుక… వాళ్లకే ఆ బాధ్యత అప్పగిస్తారు. లేని పక్షంలో.. డూప్లెసిస్ కెప్టెన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 2021 ఐపీఎల్ లో తమ జట్టుని కొత్తనాయకుడి చేతుల్లో పెట్టాలని చెన్నై యాజమాన్యం భావిస్తోందని, ధోనీ కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడని, దాంతో 2021 చెన్నై ఐపీఎల్ జట్టులో అనూహ్యమైన మార్పులు కనిపించనున్నాయన్న వార్తలు ఐపీఎల్ ఫ్రాంజెజీలలో చర్చనీయాంశాలుగా మారాయి.