గుంటూరులో స్వాతంత్య్ర దినోత్సవం రోజు నడి రోడ్డుపై హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్యకు న్యాయం చేయాలని.. ఇరవై ఒక్క రోజుల్లో నిందితుడికి శిక్ష విధించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై సోషల్ మీడియాలో ఉద్ధృతంగా ప్రచారం చేయడమే కాదు.. నిరసనలు కూడా చేపడుతున్నారు. ఒక వైపు ప్రభుత్వ పెద్దలు అందరూ దిశ చట్టం అమలవుతోందన్న భావన ప్రజల్లో కల్పించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. హోంమంత్రి సుచరిత దిశ చట్టం కింద కేసులు పెడుతున్నామని కూడా చెబుతున్నారు. దీన్ని టీడీపీ మరింత అడ్వాంటేజ్‌గా తీసుకుంది. దిశ చట్టం అమలవుతూంటే ఆ చట్టం ప్రకారం ఇరవై ఒక్క రోజుల్లో నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తోంది.
ఈ మేరకు డెడ్‌లైన్ కూడా పెట్టింది. బాధితురాలి కుటుంబానికి రూ. పది లక్షలిస్తే సరిపోతుందా.. చట్టాన్ని అమలు చేయరా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇలా దుండగులకు అండగా నిలబడి బాధితులకు నష్టపరిహారం ఇవ్వడం వల్లే .. అరచకాలు పెరిగిపోతున్నాయని నేరం చేయాలంటేనే భయపడేలా శిక్షలు విధించాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. టీడీపీ నేత నారా లోకేష్ ఈ విషయంలో లీడ్ తీసుకుని టీడీపీ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. దాదాపుగా ప్రతీ రోజూ కౌంట్ డౌన్ పెట్టి గుర్తు చేస్తున్నారు. రమ్య కు న్యాయం చేయాలని కోరుతున్నారు. నారా లోకేష్ పెట్టిన డెడ్‌లైన్‌ను వైసీపీ నేతలు పట్టించుకోనట్లుగా ఉంటున్నారు.
కానీ.. సందర్భం వచ్చినప్పుడల్లా ఎన్ని మహిళల వేధింపుల కేసులు నమోదయ్యాయో..ఎంత వేగంగా చార్జిషీట్లు వేశామో చెబుతూ లెక్కలు విడుదల చేస్తున్నారు. కానీ దీనికి పోటీగా బాధితురాళ్ల కేసుల వివరాలను టీడీపీ బయట పెడుతోంది. చివరికి మహిళా కమిషన్ చైర్మన్ కూడా లోకేష్ ఇలా డెడ్ లైన్లు పెట్టడం సరి కాదని వ్యాఖ్యానించారు. దిశ చట్టం అంతా ఫార్సు అని చెప్పాలని టీడీపీ 21 రోజుల డెడ్ లైన్ పెట్టినట్లుగా భావిస్తున్నారు. 21 రోజుల తర్వాత రమ్య హత్య కేసులో మరింత రాజకీయం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.