కేరళకు దుబాయ్ ఆర్థిక సాయం ప్రకటించిందా.. లేదా..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కేంద్రం ఇచ్చిన దాని కన్నా ఎక్కువగా రూ. 700 కోట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజు… అనుకున్నారు. ఆ మేరకు భారత్కు సమాచారం ఇచ్చారు. దుబాయ్ రాజుకు కృతజ్ఞతలు చెబుతూ మోడీ ట్వీట్ కూడా చేశారు. ఆ తర్వాత… పరిస్థితి మారిపోయింది. కేంద్రం ఆ సాయాన్ని తిరస్కరిస్తామని ప్రకటించారు. ఈ లోపే… ఇండియాలో.. ఉండే దుబాయ్ రాయబారి మాత్రం అలాంటి సాయం ఏదీ తమ రాజు ప్రకటించలేదన్నారు. దీంతో మరో సారి వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి.
ఈ లోపే… యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తూమ్.. సాయం తీసుకోని భారత్ తీరుపై పరోక్షంగా చురకలు వేస్తూ ట్వీట్లు చేశారు. ఉర్దూలో చేసిన ఆ ట్వీట్లు.. బీజేపీకి సూటిగా తగిలేలా ఉన్నాయి. మంచి పరిపాలకుడు ఎలా ఉండాలన్న అంశాన్ని తన ట్వీట్లలో సూచించారు. కొందరు నాయకులు ప్రజాసంక్షేమం కోసం పని చేస్తారని, మరి కొందరు మాత్రం కేవలం చట్టాలకు పరిమితమై కొందరి జీవితాలకు విఘాతంగా మారుతారని ట్వీట్ చేశారు. మొదటి ట్వీట్లో ఆయన నేతల గొప్ప తనాన్ని వర్ణించారు. ప్రజలకు సేవ చేసేందుకు మంచి నాయకుడు సంతోషంగా ముందుకు వస్తారని రాశారు. తన దగ్గర ఉన్నది అందరికీ ఇస్తాడని, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తాడని ఆయన ఆ ట్వీట్లో తెలిపారు. ఇక రెండవ ట్వీట్లో నేతల వైఖరిని విమర్శించారు. కొందరు నేతలు ప్రజల జీవితాలకు సమస్యగా మారుతారన్నారు. ప్రజలు తమ వెంటే ఉండాలన్న ఆశతో వాళ్లు ఉంటారన్నారు. అదే సంతోషంగా వాళ్లు భావిస్తారన్నారు. అయితే మొదటి తరహా నేతలు ఉంటేనే.. రాష్ర్టాలు, ప్రభుత్వాలు వర్ధిల్లుతాయని రషీద్ తన ట్వీట్లో తెలిపారు.
అయితే ఈ ట్వీట్ కచ్చితంగా… భారత్కు సంబంధించి చేసిందనే సూచలేవీ ఆ ట్వీట్లో లేవు. కానీ.. కేరళకు ఆర్థిక సాయం విషయం మాత్రం ఇటీవల బాగా హైలెట్ అయింది కాబట్టి… దాని గురించే అన్న చర్చ మాత్రం ప్రారంభమవుతుంది. దుబాయ్ లో ఉన్న వలస కార్మికుల్లో అరవై శాతం మంది కేరళ వాసులే. తమ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో కేరళ వాసుల పాత్ర ఉందన్న కృతజ్ఞతతో … దుబాయ్ రాజు విరాళం ప్రకటించాలనుకున్నారు. కానీ అది వివాదాలతో ఆగిపోయింది. అందుకే ఆయన అలా స్పందించారని అంచనా వేస్తున్నారు.