గత కొంతకాలంగా స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వడం లేదు. ఫ్యాన్స్షోలకు నో పర్మిషన్. బడా హీరోల సినిమాలకు ఫ్యాన్స్ షోలతోనే హడావుడి మొదలయ్యేది. హైదరాబాద్ లో సైతం అర్థరాత్రి ఆటలు సాగేవి. ఇక ఏపీలో అయితే ఆ హడావుడే వేరు. ప్రతీ పెద్ద సెంటర్లోనూ… కచ్చితంగా ఓ స్పెషల్ షో పడేది. కానీ… కొంతకాలంగా పరిస్థితులు మారిపోయాయి. స్పెషల్ షోల పేరుతో టికెట్ రేట్లు పెంచుకుని అమ్ముకోవడాన్ని ఏపీ ప్రభుత్వం నిరాకరిస్తోంది. శాంతి భద్రతల సమస్యని చూపి తెలంగాణలోనూ… పర్మిషన్లు ఇవ్వడం లేదు. అయితే అఖండతో ఫ్యాన్స్షోల హడావుడి మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న చిత్రం అఖండ. డిసెంబరు 2న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబరు 1 అర్థరాత్రి కచ్చితంగా ఫ్యాన్స్ షో వేయించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏపీలో ఎలాగున్నా, హైదరాబాద్ లో స్పెషల్ షోలు పడాల్సిందే అని పట్టుబడుతున్నారు. అఖండతో మళ్లీ స్పెషల్ షోల హంగామా మొదలయ్యే అవకాశాలూ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో రెండు థియేటర్లకు పర్మిషన్ తీసుకుని, స్పెషల్ షో వేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్, పైసా వసూల్ సినిమాలకు స్పెషల్ షోలు పడ్డాయి. అదే సెంటిమెంట్ తో ఈసారీ.. షోలు వేయాలని భావిస్తున్నారు. ఒకవేళ స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వకపోతే, ప్రీమియర్ల పేరుతో అయినా సరే, అర్థరాత్రి ఆట వేయాలని ప్లాన్. అఖండ కు అనుమతులు ఇస్తే.. పుష్సలాంటి మిగిలిన పెద్ద సినిమాలకూ ఫ్యాన్స్ షోలు వేసుకునే ఆస్కారం దక్కుతుంది.