ఫైళ్లు అన్నీ రెడీ అయ్యాయని రెండు రోజుల్లో బాంబులు పేల్చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పని గట్టుకుని సియోల్లో చేసిన ప్రకటన తెలంగా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఆ బాంబులేంటి అని చాలా మంది ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ వర్గాల నుంచి వచ్చిన ఓ లీక్ ప్రకారం ఫార్ములా వన్ ఈ రేసు విషయంలో జరిగిన రూ. 55 కోట్ల అక్రమ నగదు బదిలీ ఈ వ్యవహారంలో కీలకం కానుందని చెబుతున్నారు. ఆ డబ్బులు ఫార్ములా వన్ ఈ రేసు నిర్వహిస్తున్న కంపెనీకి లెక్కాపత్రం లేకుండా బదిలీ చేశారు. అది అక్రమ నగదు చెలామణి అవుతుంది.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేసును కాంగ్రెస్ రాగానే రద్దు చేసింది. మొదటి సారి నిర్వహణ సమయంలో ట్రాక్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు బీఆర్ఎస్ రూ.5 కోట్ల వరకు అప్పటి ప్రభుత్వం భరించింది. మిగతాది ప్రమోటర్ సంస్థనే చూసుకుంది. రెండో సీజన్ నిర్వహణకు ట్రాక్, రేసింగ్ నిర్వహణ, ఇతర ఏర్పాట్లు, మార్కెటింగ్, వివిధ దేశాల రేసర్లకు సౌకర్యాల కల్పనకు ఎవరూ ముందుకు రాలేదు. దాంతో ప్రభుత్వమే రూ.200 కోట్ల వరకూ భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీనికోసం గత సర్కారు ఆదేశాలతో రూ. 55 కోట్లను పట్టణాభివృద్ధి శాఖను చూసిన అర్వింద్ కుమార్ మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం కేబినెట్ అనుమతి తీసుకోలేదు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఏజెన్సీకి డబ్బులు విడుదల చేయడం నేరం అవుతుంది. ఈ క్రమంలోనే క్యాబినెట్ ఆమోదం లేకుండా అగ్రిమెంట్లు కుదుర్చుకున్న అధికారుల నుంచి గానీ మంత్రుల నుంచి గానీ డబ్బులు రికవరీ చేయాలని ఆలోచిస్తున్నారు. తనంతట తానుగా ఆ డబ్బులు రిలీజ్ చేశానని ఒప్పుకున్నట్లుయితే.. మొత్తం తెచ్చి కట్టాల్సి ఉండటమే కాకుండా కేసుల పాలవ్వాల్సి వస్తుంది. దీంతో ఆయన కేటీఆర్ ను ఇరికించేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ చెప్పబట్టే డబ్బులు రిలీజ్ చేశానని వివరణ ఇచ్చారు. దీంతో ప్రభుత్వంపై ఇరువురిపై కేసులు పెట్టి డబ్బులు రికవరీ చేయించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే న్యాయసలహా కూడా తీసుకున్నారు. ఇదే మొదటి బాంబు అయినా ఆశ్చర్యం లేదని అనుకుంటున్నారు.