“కఠినమైన చట్టాలు చేస్తే నేరాలు చేసే వాళ్లలో మార్పు రాదు. ఆ చట్టాలతో శిక్షలు విధించినా మార్పు రాదు… ఎప్పుడు మార్పు వస్తుందంటే వారి ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయి. జైలు శిక్ష అనేది వారిలో మార్పు తేవడానికేనని మాటల్లో చెప్పేది అందుకే…” ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మన రాజకీయ నాయకులు కూడా “ఉచితాల” విషయంలో తప్పులు చేయకుండా .. దేశాన్ని నట్టేట ముంచేయకుండా ఏదో ఒకటి చేయాలని కొంత మంది సుప్రీంకోర్టుకు వెళ్లడం.. సుప్రీంకోర్టు కూడా అది నిజమేనని అంగీకరించి ఏం చేయాలో సిఫార్సులు చేయడానికి ఓ కమిటీని నియమించడం వంటివి జరిగిన తర్వాత … కోర్టులతో సంబంధం ఉన్న ” నేరస్తుల్లో మార్పు” అనే అంశం గుర్తుకు వస్తుంది. ఇక్క రాజకీయ నేతలను నేరస్తులతో పోల్చడం తప్పలేదు. ఎందుకంటే.. కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి. వాటి గురించి పక్కన పెడితే ఇప్పుడు ఉచితాలను పక్కన పెట్టి దేశం కోసం .. అభివృద్ధి కోసం ప్రయత్నించేలా చట్టం చేస్తే సాధ్యమవుతుందా ? లేకపోతే రాజకీయలే స్వచ్చందంగా ఆలోచించి.. తాము అలా చేయకూడదు.. దేశాన్ని బాగు చేయాలని అనుకుంటే సాధ్యమవుతుందా ? అని ఆలోచిస్తే.. చట్టం చేస్తే అది చట్టంలాగానే ఉంటుంది.. కానీ ఆలోచనల్లో మార్పు వస్తే మాత్రం అది ఆచరమలో ఉంటుంది. మరి అది సాధ్యమేనా ?
ఉచితాలతో దేశాన్ని ముంచేస్తున్న రాజకీయ నేతలు !
మనది పేరు గొప్ప ప్రజాస్వామ్యం. లోపాలు చర్చించుకోకపోతే గొప్ప ప్రజాస్వామ్యం ఎప్పటికీ కాదు. ప్రపంచంలో ఎన్నో ప్రజాస్వామ్య దేశాలున్నాయి. కానీ ఏ దేశంలో అయినా ఓట్లు కొనడం అనే కాన్సెప్ట్ ఉంటుందా ? లేనే లేదు. చాలా దేశాల్లో ప్రజా ప్రతినిధులు … ఇరవై, ముఫ్పై వేల మందికే ఒకరు ఉంటారు. అలాంటి చోట్ల కూడా ఓట్ల కొనుగోలు ఉండదు. కానీ ఇండియాలో మాత్రం రెండున్నర లక్షల మంది ఓ ప్రజాప్రతినిధి ఉన్నా.. అతను అసువుగా యాభై , అరవై వేల ఓట్లు కొనేస్తాడు. అంతేగా వారికి పోటీగా ప్రభుత్వం ప్రజల సొమ్ముతో వారి ఓట్లు కొనేందుకు ఉచిత పథకాలను రంగంలోకి తెస్తుంది. ఇప్పుడు దేశంలోని ప్రతీ రాష్ట్రంలో సంక్షేమం పేరుతో ఉచిత పథకాలు సగం రాష్ట్ర బడ్జెట్‌ను మింగేస్తున్నాయి. చాలా రాష్ట్రాలు బడ్జెట్‌ను కూడా మించిపోయి.. అప్పులు చేసి మరీ పంచుతున్నాయి. ఉచిత పథకాల వలన ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. దీని మూలంగా లోటు పెరుగుతుంది. అవసరమైన పనులకు, ప్రాజెక్టులకు నిధులు సరిపోవు. ఉచిత పధకాలు మరియు సబ్సిడీలు అధికంగా ఇస్తే అది పరోక్షంగా ప్రజల దగ్గర ఉండే డబ్బును పెంచుతుంది, ప్రజలు అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం ప్రారంభిస్తారు, ఇది డిమాండ్ – సరఫరా అసమతుల్యత గొలుసుకు దారితీస్తుంది, డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ధరలు పెరుగుతాయి మరియు ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని మనకు తెలుసు. ప్రజలకు కావాల్సింది ఉపాధి, నాణ్యమైన సరుకులు, మేలు రకం ఎరువులు, ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్య అంతే కానీ ఉచిత పధకాలు, తాయిలాలు కావు.
సంక్షేమం వేరు.. ఉచిత పథకాలు వేరు !
చాలా మంది విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తూ ఉంటారు. అదేమింటే.. పేద ప్రజలకు మేలు చేయవద్దా అని వాదిస్తూ ఉంటారు. ఉచిత పథకాలు దేశాభివృద్ధికి ప్రమాదకరమని ప్రధాని మోదీ అనగానే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఇదే వాదనతో తెరపైకి వచ్చారు. పెద్దలకు లక్షల కోట్లు మాఫీ చేయవచ్చు కానీ పేదలకు ఉచిత బియ్యం.. విద్య.. వైద్యం ఇవ్వకూడదా అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇలాంటి బాధ్యతా రాహిత్యరాజకీయ నాయకులు ఉన్నంత కాలం దేశం ముందుకు అడుగు పడే అవకాశమే ఉండదు. దేశంలో ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కానీ ఇస్తున్నారా అంటే ఆలోచించాల్సిందే. ఆరోగ్యశ్రీ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఓ పథకం అమలవుతోంది.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం అందించే పథకం. ఆ పథకం మొదట్లో బాగా అమలయ్యేది .. ఇప్పుడెలా అమలవుతోంది ? . ఆ పథకంపై ప్రచారానికి పెట్టే ఖర్చు కూడా ఇప్పుడు పెట్టడంలేదు. నిజంగా సంక్షేమం అంటే.. పేద ప్రజలకు నిజంగా అవసరం ఉన్న వారికి విద్యు, వైద్యం ఉచితంగా అందించేలా చూడటం సంక్షేమం. ఏ పనీ చేసుకోలేని వాళ్లకు కడుపు నింపడం సంక్షేమం. అంతే కానీ.. దేశంలో ఐదున్నర కోట్ల మంది ఉంటే.. నాలుగున్నర కోట్ల మందికి రేషన్ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సంక్షేమం కాదు. ఈ విషయం రాజకీయ నాయకులకు తెలియదా.. అంటే.. తెలియకుండా ఎలా ఉంటుంది… అన్నీ తెలిసే చేస్తున్నారు.
ఎన్నికల్లో గెలుపే రాజకీయ నాయకులకు ముఖ్యం.. ప్రజలు కాదు !
మన దేశంలో రాజకీయ నాయకులకు ఎన్నికల్లో గెలుపే ముఖ్యం. అందుకోసం ఏమైనా చేస్తారు. ఓట్లను రకరకాలుగా కొనుగోలు చేస్తారు. నేరుగా డబ్బులిస్తారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇస్తారు. ప్రభుత్వం వచ్చాక ఇస్తామని చెబుతారు. ఇలా ఓట్లను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు నేరుగా నగదు బదిలీ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. చివరికి రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు కూడా నగదే ఇస్తామంటున్నారు. కిలో రెండుకు ఇచ్చే బియ్యానికీ డబ్బులే ఇస్తామంటున్నారు. అంటే.. అసలు ఆయా పథకాల ఉద్దేశం ఏమిటో కూడా పాలకులు తెలుసుకోలేకపోతున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అలాంటి రాజకీయ నాయకులకు ఎన్నికల్లో గెలుపే ముఖ్యం. వారికి ప్రజల దుస్థితి పట్టదు. భవిష్యత్ గురించి ఆలోచన ఉండదు. వారికి అధికారం కావాలి… అందు కోసం ఏమైనా చేస్తారు. ఆదాయం ఎంత..? అప్పులు ఎంత ? సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టగలం అన్న ఆలోచనలు అసలు చేయరు. ప్రభుత్వ.. ప్రజా ఆస్తులు తెగనమ్మి.. తాకట్టు పెట్టి కావాలంటే పది శాతానికిపైగా వడ్డీకి తెచ్చి తమ పేరుతో పెట్టుకునే పథకాలకు నగదు బదిలీ చేస్తారు. ప్రభుత్వం ఇలా ఉచిత పథకాల పేరుతో ధనం వెదజల్లుతుంటే, ఆ మొత్తాన్ని సాధారణ పౌరులే తిరిగి చెల్లించాలి. ఎప్పుడు పన్నులు ధనవంతులే చెల్లించరు, పేదవారు కూడా చెల్లిస్తారు. వారు కొనే అగ్గిపెట్టెలపై కూడా పన్ను ఉంటుందనే సంగతి వారికి తెలియదు కానీ.. అది నిజం. కానీ వారికి అవగాహన ఉండదు… ఉన్న వారికి మతం.. కులం మత్తు ఎక్కించారు. అందుకే పాలకులకు తిరుగులేకుండా పోయింది. ఉన్నదంతా దోచేసుకుని చిప్ప చేతిలో పెట్టి అందులో పది రూపాయలు వేస్తే అదే మహాద్భాగ్యం అనుకునే స్థితికి ప్రజల్ని తీసుకు వచ్చారు. ఇప్పుడు పాలకులు విశ్వరూపం చూపిస్తున్నారు. కానీ దేశానికి ఏ గతి పట్టించారో మాత్రం చూసుకోవడంం లేదు.
రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థపైనే కాదు.. ఓ తరాన్ని నిర్వీర్యం చేస్తుంది !
ఉచిత పథకాలు ప్రజలపై తప్పుడు ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడు ప్రభుత్వం ఉచితానుచితాలు ఇస్తుందా అని ఎదురుచూస్తు కష్టపడటం మానేసే రోజులు ముందు ఉన్నాయి.వీటి వలన ప్రజలపై చెడు ప్రభావం పడుతుంది. ఎప్పుడు ప్రభుత్వం ఉచితానుచితాలు ఇస్తుందా అని ఎదురుచూస్తు కష్టపడటం మానేసే రోజులు వచ్చేశాయి. యువశక్తి నిర్వీర్యం అయిపోయింది. ప్రభుత్వం అన్నీ సమకూర్చుతోంది కదా తాము ఎందుకు కష్టపడాలన్న ఆలోచనకు మెజార్టీ యువత వస్తున్నారు. ఇది ప్రమాదకర పరిణామం. ఈ పరిస్థితి ఇలా పెరిగిపోతే.. దేశంలో పని చేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. ప్రభుత్వంపై ఆధారపడేవారి సంఖ్య పెరిగిపోతుంది. తమపై ఆధారపడేవారికి… కడుపు నింపితే చాలు తమకు ఓట్లేస్తారని రాజకీయ పార్టీలు సంబరపడవచ్చు కానీ.. అది రాజకీయ నాయకులుగా వారి బాధ్యతల్ని ఘోరంగా విస్మరించి.. దేశానికి ద్రోహం చేసినట్లవుతుంది. కానీ అలాంటి ద్రోహాల గురించి ఆలోచించే నేతలు ఇప్పుడు లేరు.
మధ్య తరగతిలో పెరిగిపోతున్న అసహనం !
ఉచితాలు కిందిస్థాయి వారు తీసుకుంటున్నారు. పై స్థాయివారికి అవసరం లేదు. కానీ మధ్యలో ఉండేవారి పరిస్థితి ఏమిటి. నిజానికి ఉచితాలకు వచ్చే డబ్బంతా ఎక్కువగా పన్నుల ద్వారా మధ్యతరగతి ప్రజల ఆదాయం నుంచే వసూలు చేస్తున్నారు. ఈ రోడుల్లో ఏటా రెండున్నర లక్షలు సంపాదించకుండా ఎవరు ఉంటారు ? . తాపీ పని చేసుకునే వారికి కూడా నెలకు రూ. ముఫ్పై వేలు వచ్చే కాలం. లేకపోతే.. రోజువారీ ఖర్చులు కూడా గడవనంతగా ధరలు పెరిగిపోయాయి. అలాంటిది రెండున్నర లక్షలు దాటిన దగ్గర నుంచి కేంద్రం ఆదాయపు పన్ను పిండుకుంటోంది. ఆ తర్వాత ఉప్పు..పప్పులపై జీఎస్టీలు సంగతి చెప్పాల్సిన పని లేదు. మొత్తంగా మధ్య తరగతి జీవితాల నుంచి అన్నీ పిండేసుకుని.. ఉచితాలను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ప్రభుత్వాధినేతలు తమ పేర్లు.. తమ తాత ముత్తాల పేర్లు పెట్టుకుని తమేదో ఇస్తున్నట్లుగా ఫోజోలు కొడుతూ మీటలు నొక్కుతున్నారు. కానీ అదంతా మధ్యతరగతి ప్రజల కష్టం శ్రమ. వారికి ఏ ప్రభుత్వ పథకమూ అందదు. ఏ సౌకర్యం పొందాలన్నా… వారికి నిబంధనలు వర్తిస్తారు. ఈ కారణంగా మధ్య తరగతి ప్రజలు అన్యాయమైపోతున్నారు. వారిలో ఎక్కువ మంది.. ఇదంతా ఎందుకు ప్రభుత్వంపై ఆధారపడితే సరిపోదా అన్న భావనకు వచ్చేస్తున్నారు.
కష్టపడి సంపాదించుకునేవాళ్లున్న రాజ్యమే సుభిక్షంగా ఉంటుంది !
ఓ సారి కృష్ణుడు ధర్మరాజు ని మహాబల చక్రవర్తి రాజ్యానికి తీసుకెళ్లాడు. అక్కడ ప్రజలు ఓ సారి వాడిన వస్తువును వాడకపోవడం ధర్మరాజు గమనించాడు. తర్వాత మహాబల చక్రవర్తికి ధర్మరాజును కృష్ణుడు పరిచయం చేశాడు. మహా గొప్ప దానకర్ణుడని.. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తారని చెప్పాడు. అప్పుడు ఆ ధర్మరాజు.. తనను మహాబల చక్రవర్తి గొప్ప మానవత్వం ఉన్న వాడిగా చూసి గౌరవిస్తారని అనుకున్నాడు. కానీ మహాబల చక్రవర్తి మాత్రం ధర్మరాజు ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు. మా రాజ్యంలో అందరికి కష్టపడి పనిచేస్తారు.. సాయం ఎవరూ అడగరు.. దానధర్మాలకు తావులేదు.. ఆయన తన పరిపాలనలో అందరూ అడుక్కునేలా.. ఎవరైనా సాయం చేస్తారేమో ఎదురు చూసేలా చేశారు. ఈయన రాజ్యంలో అంతమందిని పేదవారిగా ఉంచినందుకు ఈ రాజు మొఖం చూడాలంటే నేను సిగ్గుపడుతున్నాను అని తేల్చేశారు. ఈ సమాధానం విని.. ధర్మరాజుకు తాను ఎంత తప్పు చేస్తున్నారో తెలుసుకుని ఉంటారు. ధర్మరాజు గొప్ప దానకర్ణుడిగా పేరు తెచ్చుకుని ఉండవచ్చు కానీ ఆయన ప్రజలు మాత్రం బిచ్చగాళ్లుగా మారిపోయారని ఈకథలో నీతి చెబుతోంది.
మన పాలకులు ధర్మరాజులు.. ప్రజలను బిచ్చగాళ్లను చేస్తారు !
ఇప్పుడు ధర్మరాజు గొప్పా.. మహాబల చక్రవర్తి గొప్పా.. అని ఆలోచిస్తే.. నిస్సందేహంగా ధర్మరాజే గొప్ప అంటారు మెజార్టీ ప్రజలు. ఎందుకంటే వారి మైండ్ సెట్ అలా మారిపోయింది. తాము సంపాదించుకుంటే వంద రూపాయలు వస్తాయంటే… సంపాదించుకోవడం మానేసి ఉచితంగా వస్తాయంటే పది రూపాయల కోసం పది గంటలు క్యూలో నిల్చోవడానికి సిద్ధపడేలా సమాజాన్ని ఇప్పటికే మార్చేశారు. ఇంకా ఇంకా మారుస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న రాజులు ధర్మరాజులే.. కానీ మనకు కావాల్సింది మహాబల చక్రవర్తుల్లాంటి వారు. అలాంటి వారు కావాలంటే.. రాజకీయ నేతల ఆలోచనల్లో మార్పు రావాలి. ఉచితాల గురించి ఆలోచించాలి. మార్పులు చేసుకోవాలి. అలాంటి ఆలోచనలు వారు చేసినప్పుడే దేశం నిలబడుతుంది. ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తుంది. లేకపోతే.. అధోగతికి పయనిస్తూనే ఉంటుంది.