బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్నట్లుగా సౌరభ్ గంగూలీ పరోక్షంగా ప్రకటన విడుదల చేశారు. ప్రజల కోసం కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇటీవల ఆయన భార్య కూడా గంగూలీ రాజకీయాల్లోకి వస్తారని ప్రకటనలు చేశారు. బీజేపీ నేతలు పలుమార్లు గంగూలీతో సమావేశమవుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఆయన చేసిన ప్రకటన బెంగాల్ రాజకీయాల్లో కొత్త కలకలానికి కారణం అవుతోంది. బీజేపీకి చాలా దగ్గరగా గంగూలీ వ్యవహరిస్తున్నారు. బీసీసీఐ చీఫ్‌గా ఆయన కొనసాగడం వెనుక అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయంటారు. ప్రస్తుతం బీసీసీఐని .. అమిత్ షా కుమారుడు జే షాతో కలిసి గంగూలీ నడుపుతున్నారు.
గంగూలీ రాజీనామా చేసినట్లుగా స్పష్టమైన ప్రకటన చేయనప్పటికీ అంతర్గతంగా మాత్రం ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని జేషా ఖండించారు. కానీ బీసీసీఐలో గంగూలీ ఇన్నింగ్స్ ఇక పొలిటికల్ ఇన్నింగ్సే మిగిలిందని చెబుతున్నారు. బెంగాల్లో బలమైన ముఖ్యమంత్రి అభ్యర్థి కోసం బీజేపీ వెదుకుతోంది. గతంలో చేసినప్రయోగాలు ఫలితాలు ఇవ్వలేదు. పార్టీలో చేరిన వారంతా వరుసగా రాజీనామా చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ అసంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికి పడిపోయింది.
దీంతో ఇప్పుడు ఓ బలమైన.. ప్రజాకర్షక నేతను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఆ మేరకు గంగూలీని లైన్లోకి తెచ్చారు. నిజానికి గతంలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరిగింది. గత ఎన్నికలకు ముందు రెండు సార్లు గుండెపోటు రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. రాజకీయాల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు అమిత్ షా మార్గదర్శకత్వంలో రంగంలోకి దిగుతున్నట్లుగా కనిపిస్తోంది.